31న గస్తీ.. ముమ్మరం.. : కర్నూలు ఎస్పీ
1 min readఅర్ధరాత్రి వరకు న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి లేదు
హద్దుమీరితే… చర్యలు తప్పవు..
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: ఓమిక్రాన్ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధించిందన్నారు కర్నూలు జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నూతన సంవత్సర వేడుకల సంధర్బంగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి హోటళ్లలో పార్టీలు, సామూహిక పార్టీలకు అనుమతులు లేవన్నారు. ప్రజలు, యువత పోలీసులకు సహకరించాలన్నారు. ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్ తీసేసి అధిక శబ్దాలతో ర్యాష్ డ్రైవింగ్ తో హోరెత్తించదటం, బాణసంచా పేల్చడం వంటి వాటి వలన ప్రశాంతతకు భంగం కలిగి వృద్దులకు, చిన్న పిల్లలకు, రోగులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా, ఈవ్ టీసింగ్ కు పాల్పడినా చట్ట రిత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఓమిక్రాన్ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కోవిడ్ ఆంక్షలు తప్పనిసరి అవుతున్నాయి. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సహకరించాలన్నారు. హోటల్స్ లో, బార్లలో రహస్య పార్టీలు నిర్వహించి నూతన సంవత్సర సంబరాలు చేసుకోవడానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు బృందాలు బ్లూ కోల్డ్, రక్షక్, స్పెషల్ పార్టీ పోలీసులు డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం నుంచి నగరంలో గస్తీలు చేపడతారన్నారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటారన్నారు.