పత్తికొండను కరువు ప్రాంతంగా ప్రకటించాలి
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ నియోజకవర్గం లోని ఐదు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని జనసేన పార్టీ పత్తికొండ నియోజకవర్గం ఇన్చార్జి సి జి రాజశేఖర్ జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం జనసేన పార్టీ తరపున జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి అందజేశామని తెలిపారు. మన పత్తికొండ నియోజకవర్గం లో రైతుల కష్టాలను బాధలను వివరిస్తూ, ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో అనుకూలమైన వర్షపాతం లేకపోవడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, సాగు చేసిన వివిధ రకాల పంటల రైతులకు పెట్టుబడి పెరగడం దానికి తోడు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం ప్రధాన సమస్యగా మారిందన్నారు. సుమారుగా ఒక ఎకరాకు వివిధ రకాల పంటలు ఖర్చులు 20000 నుండి 40 వేల రూపాయల వరకు రైతులు ఖర్చుపెట్టి, నష్టపోయారు. బ్యాంకుల దగ్గర మరియు దళారుల దగ్గర పంటల కోసం అప్పులు తీసుకొని కట్టుకోలేని స్థితిలో రైతులు ఉన్నారు.ఆ అప్పులు బాధ తట్టుకోలేక కొంతమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన చెందారు. ఈ కారణంగా రైతుల కుటుంబాలు చితికి పోతున్నారని అన్నారు. రైతుల పిల్లలను కూడా చదువులు మధ్యలో నిలిచి పోయి, బ్రతుకుతెరువు కోసం ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు, వెళుతున్నారని, మరికొందరు చావులకు సిద్ధపడుతున్నారని తెలిపారు. కావున జిల్లా కలెక్టర్ గారు స్పందించి మా పత్తికొండ నియోజకవర్గంలోని 5 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని, రైతు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశామని అన్నారు. కరువు మండలాలను ప్రకటించకపోతే రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాలు రోడ్డున పడుతాయి కావున ఇలాంటి సంఘటనలు జరగకముందే, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని పోరామని తెలిపారు. ఒకవేళ రైతులు ఆత్మహత్య చేసుకుంటే దానికి, పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాల్సి ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, ఎర్రి స్వామి, కరణం రవి, శ్రీనివాస్ రెడ్డి, వడ్డే వీరేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.