అధిక బరువు వల్లే మహిళల్లో పీసీఓఎస్
1 min read– జీవనశైలి మార్పులతో తగ్గించుకునే అవకాశం
– ఆహారపు అలవాట్లలో మార్పులపై ఉచిత శిబిరం
– సెంచురీ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహణ
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : పోషకాహార లోపమే పలు రకాల వ్యాధులకు కారణం అవుతుంది. మహిళల్లో ఎక్కువగా కనిపించే పాలీసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్ (పీసీఓఎస్) అనే సమస్య కూడా అధిక బరువు వల్లే వస్తుంది. దానివల్లే శరీరంలో అనేక రకాల మార్పులు చోటుచేసుకుంటాయి. నేటి ఆధునిక జీవనశైలిలో శారీరక వ్యాయామం తగినంతగా లేకపోవడం, దానికితోడు జంక్‌ఫుడ్ ఎక్కువగా తీసుకోవడంతో స్థూలకాయం, ఇతర ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఆహారంలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం, ఇతర చర్యల ద్వారా శారీరక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలన్న విషయమై సెంచురీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఈ రోజు ఉచిత శిబిరాన్ని నిర్వహించారు. ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ తరణి నాయుడు నేతృత్వంలో జరిగిన ఈ శిబిరంలో ఎవరి శరీరానికి ఎలాంటి ఆహారం, ఎంత మోతాదులో తీసుకోవాలనే అంశాలను వివరించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని సెంచురీ ఆస్పత్రిలో ఫ్రీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ప్రోగ్రాంలో భాగంగా రూ.2 వేల విలువ చేసే” డైట్ ప్లాన్ , డైటీషియన్ కన్సల్టేషన్” ఉచితంగానే అందిస్తున్నామని డాక్టర్ తరణి నాయుడు వెల్లడించారు. ఈ రోజు ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు” ఫ్రీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ప్రోగ్రామ్”నిర్వహించారు, ఈ అవకాశాన్ని 200 మంది సద్వినియోగం చేసుకున్నారు. స్థూలకాయం, మధుమేహం, గుండె జబ్బులు, థైరాయిడ్, కిడ్నీ వంటి వ్యాధులలో ఆహారమే ప్రధాన పాత్ర ను పోషిస్తుందని వివరించారు. ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటిస్తే చాలా వరకు ఆరోగ్య సమస్యలన్నింటినీ నియంత్రించే అవకాశాలు ఉన్నాయని సూచించారు. మనం తీసుకునే రోజువారీ ఆహారంలో సమతుల్యతను పాటిస్తూ అన్ని పదార్ధాలనూ తీసుకోవాలని తరణి నాయుడు తెలిపారు. ఎవరి శరీర తత్వానికి ఎలాంటి ఆహారం సరిపోతుందన్నది వేర్వేరుగా ఉంటుందని, దానికి అనుగుణంగానే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని చెప్పారు. తమ ఆరోగ్యాన్ని తమ చేతుల్లో ఉంచుకోవడం ఎలాగో తెలుసుకోవాలని సూచించారు. ఈ శిబిరంలో ప్రధానంగా కార్పొరేట్ వెల్‌నెస్, హెల్త్ టాక్ తదితర అంశాలను నిర్వహించారు.