ప్రజలు పదే పదే అధికారుల చుట్టూ తిరగకుండా చూడాలి: జిల్లా కలెక్టర్
1 min read– మండల,సచివాలయాల స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలు జిల్లా స్థాయికి ఎందుకు వస్తున్నాయి
– స్పందన కంటి తుడుపు చర్య కాదు… సీరియస్ గా తీసుకోవాలి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మండల,సచివాలయాల స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలు జిల్లా స్థాయికి ఎందుకు వస్తున్నాయని జిల్లా కలెక్టర్ జి.సృజన అధికారులను ప్రశ్నించారు.సోమవారం కలెక్టర్ గా బాధ్యతలను స్వీకరించిన అనంతరం తొలి అధికారిక కార్యక్రమంగా సునయన ఆడిటోరియంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి వచ్చిన వినతులను ఆమె స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 30, 40 సమస్యలు చూశాను.. ఇందులో 90 శాతం మండలాలు, సచివాలయాల్లో పరిష్కరించాల్సిన చిన్న చిన్న సమస్యలే… సచివాలయ వ్యవస్థ వచ్చి మూడేళ్లు అయింది..అక్కడ పరిష్కరిస్తే ఇక్కడికి ఎందుకు వస్తున్నాయి అని జిల్లా అధికారులు, వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్న అధికారులను కలెక్టర్ ప్రశ్నించారు.స్పందన అంటే కంటి తుడుపు చర్య కాదని, ఈ కార్యక్రమాన్ని అధికారులు సీరియస్ గా తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.. పరిష్కరించలేకపోతే ఏ కారణం వల్ల పరిష్కారం చేయలేకపోయాలో ఎండార్స్మెంట్ లో స్పష్టంగా చెప్పాలన్నారు.. అలా చెప్తే ప్రజలు మళ్లీ మన వద్దకు రారని కలెక్టర్ సూచించారు..అలాగే సమస్య పరిష్కరించే అధికారికి కాకుండా ఇతర శాఖలకు పంపిస్తే ఆ ఫిర్యాదు రిజెక్ట్ అయి, ప్రజలను పదే పదే అధికారుల చుట్టూ తిప్పుకున్నట్లవుతుందని, తద్వారా సమస్యకు పరిష్కారం ఇవ్వకపోగా మనమే సమస్య కాకూడదని కలెక్టర్ హితవు పలికారు.. స్పందన సమస్యలను గడువు లోపల పరిష్కారం ఎంత ముఖ్యమో, నాణ్యమైన పరిష్కారం కూడా అంతే ముఖ్యం అన్నారు..సమస్యలకు ఏ విధమైన పరిష్కారం చూపారో రాండం గా చెక్ చేస్తానన్నారు..సమస్యలకు సక్రమంగా స్పందించని అధికారుల పట్ల చర్యలు తప్పవని కలెక్టర్ సున్నితంగా హెచ్చరించారు.వెనుకబడిన జిల్లాలో ప్రజలకు మన అవసరం చాలా ఉందని అధికారులు గుర్తించాలన్నారు..ప్రజల సమస్యలకు స్పందించాలన్నారు.. జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని నేడు సీఎం ప్రారంభిస్తున్నారని, అధికారులు స్పందన కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మండల స్పెషల్ అధికారుల వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.సమావేశంలో జిల్లా అధికారులు మరియు మండలాల నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.