టిడిపితోనే ప్రజలకు భవిష్యత్తు.. టిజి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి టిజి భరత్ అన్నారు. నగరంలోని 47 వ వార్డులో ఆయన ఇంటింటి పర్యటన చేపట్టి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలిసి వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు తాము పడుతున్న బాధలను టిజి భరత్ తో చెప్పుకున్నారు. పారిశుద్ధ్య సమస్యలు, త్రాగునీటి సమస్యలు, విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని మొరపెట్టుకున్నారు. పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని పలువురు గౌండాలు టిజి భరత్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ ఏ వార్డుకు వెళ్లినా ప్రజలు సమస్యలతోనే ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి తీసుకువస్తున్నారన్నారు. ప్రధానంగా మౌలిక సదుపాయాలైన పారిశుద్ధ్యం, త్రాగునీరు, విద్యుత్తు సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజల వద్దకు వచ్చి మాట్లాడితేనే వీరు పడుతున్న ఇబ్బందులు తెలుస్తాయన్నారు. పనులు లేక గౌండాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే గౌండలకు ప్రతిరోజు పని ఉండేటట్లుగా చేస్తామన్నారు. చిన్న ఎలక్ట్రికల్ లైన్ వేస్తే కొన్ని కుటుంబాలు పడుతున్న సమస్య పరిష్కారం అవుతుందన్నారు. అధికారులు ఇప్పటికైనా ఈ సమస్యలపై దృష్టి పెట్టాలని తాను కోరుతున్నట్లు చెప్పారు. దోమలు పెరిగి అంటువ్యాధులు వస్తున్నాయని దీని ద్వారా ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని ఇప్పటికైనా పారిశుధ్య సమస్యను పరిష్కరించాలన్నారు. టిడిపి ప్రభుత్వం వస్తే ఇసుకను ఉచితంగా అందిస్తామని తద్వారా నిర్మాణ రంగంలో ఉన్న ఎంతోమందికి ఉపాధి దొరుకుతుందన్నారు. ఇక కర్నూల్ లో తాను ఎమ్మెల్యే అయితే ప్రతి వార్డులో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించి కర్నూలు అభివృద్ధి చేసుకోవాలని తాను కోరుతున్నట్లు టీజీ భరత్ చెప్పారు. ఈ కార్యక్రమంలో నేతలు సురేంద్ర, కిరణ్, జయన్న, పరశురాముడు, మన్సూర్ ఆలీఖాన్, రవి, వినోద్ చౌదరి, శ్రీధర్, శివ, యూనుస్, తదితరులు పాల్గొన్నారు.