పది ‘ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించండి…
1 min read
ప్రతి పరీక్షా కేంద్రం దగ్గర 144 సెక‌్షన్ అమలు చేయాలి
కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ లాంటివి జరగకూడదు
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ నేడు: ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా, ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ లోని మిని కాన్ఫరెన్స్ హాల్ లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ పకడ్బందీ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి నెల 17 నుండి 31 వ తేదీ వరకు జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు, మార్చి 17 నుండి 28 వరకు జరిగే పదవ తరగతి ఓపెన్ పరీక్షలకు, మార్చి 3 నుండి మార్చి 15 వ తేది వరకు జరిగే ఇంటర్మీడియేట్ ఓపెన్ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని, పరీక్షల నిర్వహణలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగరాదని పరీక్షల నిర్వహణకు తగు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.. కర్నూలు జిల్లాకు సంబంధించి అన్నిటికీ కలిపి 172 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో 40,776 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. గత రెండు మూడు సంవత్సరాలలో జరిగిన ఇన్సిడెంట్లను దృష్టిలో పెట్టుకొని సమస్యాత్మకంగా గుర్తించిన సెంటర్ల వివరాల లిస్టును పోలీసు అధికారులకు, తహసిల్దార్లకు ఇవ్వాలని కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు.. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల ఏర్పాటుకు సంబంధించిన ప్రొసీడింగ్ లు ఇచ్చేందుకు డిఆర్ఓ తో కో అర్డినేట్ చేసుకోవాలని కలెక్టర్ డిఈఓ ను ఆదేశించారు.. ప్రతి పరీక్ష కేంద్రం దగ్గర 144 సెక‌్షన్ అమలు చేయాలన్నారు. స్ట్రాంగ్ రూమ్స్ దగర ఆర్మ్డ్ గార్డ్స్ ని ఏర్పాటు చేయాలని, పేపర్ డిస్ట్రిబ్యూషన్ కి ఎస్కార్ట్ తో వెళ్లాలని, పరీక్ష కేంద్రాల పరిధిలో ఉన్న జీరాక్స్ సెంటర్లు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని, పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్ పోలీసు అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాలలో నిరంతరాయంగా విద్యుత్ సౌకర్యం ఉండాలని, పరీక్షా కేంద్రంలో త్రాగు నీటి వసతి కల్పించాలని, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సరైన సమయానికి చేరుకునేందుకు అవసరమైన బస్సు సదుపాయాలు కల్పించాలని, రవాణా విషయంలో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పరీక్ష కేంద్రాల దగ్గర మెడికల్ స్టాఫ్ తో పాటు, ఓఆర్ఎస్, మెడికల్ కిట్లు ఏర్పాటు చేసి అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ వైద్య, ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. ప్రశ్నపత్రం లీక్‌లు కి సంబంధించి ఎలాంటి వదంతులు వచ్చినా వెంటనే కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారికి తెలియజేయాలని కలెక్టర్ సమాచార శాఖ అధికారులను ఆదేశించారు.. 10వ తరగతి పరీక్షలలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్ జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వివిధ శాఖలకు కేటాయించిన విధులను బాధ్యతతో నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు సంబంధించి పరీక్షల నిర్వహణకు 172 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో 40,776 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. సమస్యాత్మకంగా ఉన్న పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం వారు సీసీ కెమెరాలు ఇవ్వడం జరిగిందని వాటిని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. సమీక్షలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ సి.వెంకటనారాయణమ్మ, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
