ఉపాధి హామీ పధకం ద్వారా శాశ్వత అభివృద్ధి పనులు..
1 min readజిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్
శాశ్వత అభివృద్ధి పనుల ప్రతిపాదనలు ఈనెల 12వ తేదీలోపల సమర్పించాలి..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం ద్వారా రాబోయే ఆర్ధిక సంవత్సరంలో చేపట్టవలసిన శాశ్వత అభివృద్ధి పనులపై ప్రతిపాదనలను ఈ నెల 12వ తేదీలోగా సమర్పించాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అధికారులకు ఆదేశించారు. . స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంలో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో చేపట్టిన పనులు, రాబోయే సంవత్సరంలో చేపట్టవలసిన కార్యక్రమాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ వ్యవసాయ కూలీల వలసలు నివారించేందుకు ఉద్దేశించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంలో కాల్వలు, చెరువులు పూడిక తీత పనులతో పాటు ఉద్యానవనాల పంటల పెంపకానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పన, చెక్ డ్యామ్ లు, పాడి పశువులకు మేత పెంపకం, మంచినీటి చెరువుల అభివృద్ధి, కొత్తగా అమృత్ సరోవర్ చెరువుల నిర్మాణం, పాఠశాలల్లో కూరగాయల మొక్కలు పెంపకం వంటి వాటికి మౌలిక సౌకర్యాల కల్పన వంటివి గ్రామీణ ఉపాధి హామీ పధకంలో చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిందని, వాటికి అనుగుణంగా జిల్లాలో సంబంధిత శాఖల అధికారులు ప్రస్తుత సంవత్సరంలో సంబంధిత పనులు చేపట్టడంతో పాటు, రాబోయే సంవత్సరంలో చేపట్టవలసిన పనులపై ప్రతిపాదనలను ఈనెల 12 వ తేదీలోగా అందించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో వ్యవసాయం, ఉద్యానవనాలు పంటలు, చెరువుల అభివృద్ధి, తాగునీటి వనరుల అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలల్లో కూరగాయల మొక్కల పెంపకం, నగర వనాలు, పల్లె వనాలు ఏర్పాటు, తదితర శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టే అవసకం ఉన్న దృష్ట్యా, ఈ పనులపై పై క్షేత్రస్థాయిలో అధికారులకు అవగాహన కలిగించేందుకు సమావేశాలు నిర్వహించాలని డ్వామా పిడి ని కలెక్టర్ ఆదేశించారు. జగనన్న పాల వెల్లువ కార్యక్రమంలో పాడి పశువులకు పోషకాలతో కూడిన పశువుల మేత అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా అటవీ శాఖాధికారి రవీంద్ర దామా, సామాజిక వన విభాగం అధికారి హిమ శైలజ, డ్వామా పిడి రాము, డీఆర్డీఏ పిడి విజయరాజు,పశుసంవర్ధక శాఖ జెడి నెహ్రూ బాబు, ఇరిగేషన్, పంచాయతీ రాజు, ఆర్ డబ్ల్యూ ఎస్, ఎస్ఈ లు శ్రీనివాసరావు, కేదారేశ్వరరావు, సత్యనారాయణ, జిల్లా వ్యవసాయశాఖాధికారి వై. రామకృష్ణ, ప్రభృతులు పాల్గొన్నారు.