‘టెలీ కన్సల్టేషన్ సేవల’కు వైద్యులు దరఖాస్తు చేసుకోండి
1 min read– ఏపీ స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్ కేఎస్ జవహర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్, విజయవాడ:104 కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా టెలీ కన్సల్టేషన్ సేవలు అందించడానికి ఆసక్తిగల వైద్యులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఏపీ స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్ కేఎస్ జవహర్ రెడ్డి పిలుపునిచ్చారు. కరోనా విపత్కర సమయంలో 104 కాల్ సెంటర్ ద్వారా అనుభవజ్ఞులైన వైద్యుల సేవలు వినియోగించుకోనున్నట్లు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్ సెకెండ్ వేవ్ పై పోరాటంలో డాక్టర్లు భాగస్వాములై తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఎంపిక చేయబడిన డాక్టర్లు 104 కాల్ సెంటర్ కు ఫోన్ చేసిన కాలర్ల నుండి కోవిడ్-19 లక్షణాలను విశ్లేషించి, వర్చువల్ ట్రైనింగ్ తో పాటు హాస్పిటల్ అడ్మిషన్, టెస్టింగ్ మరియు వైద్య సలహాలకు సంబంధించి తదుపరి చర్యలపై తగు సూచనలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. డాక్టర్లు అందించే టెలీ కన్సల్టెన్సీ సేవలకు గానూ గంటకు రూ.400 పారితోషికం చెల్లిస్తామన్నారు. ఆసక్తిగల డాక్టర్లు http://dashboard.covid19.ap.gov.in/doctor_registrationform/ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలని జవహర్ రెడ్డి కోరారు.