అధ్యక్షుడి ఇంట్లో గుట్టలు గుట్టలుగా డబ్బు !
1 min readపల్లెవెలుగువెబ్ : శ్రీలంకలో అధ్యక్షుడి అధికారిక నివాసానికి అడ్డంగా పెట్టిన బారికేడ్ల కట్లు తెంచుకుని లోపలికి చొచ్చుకెళ్లిన నిరసనకారులకు భారీగా డబ్బు కనిపించింది. అయితే, నిరసనకారులు ఆ డబ్బును భద్రతా సిబ్బందికి అప్పజెప్పారని స్థానిక దినపత్రిక ‘డైలీ మిర్రర్’ ఒక కథనంలో ప్రచురించింది. అధ్యక్ష భవనంలోకి ప్రజల చొరబాటు శనివారంతోనే ఆగిపోలేదు. ఆదివారం కూడా కొనసాగింది. వేలాది మంది ప్రజలు రాజపక్స నివాసంలోకి ప్రవేశించి అన్ని గదులూ చూస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే, ఆదివారంనాడు అధ్యక్ష భవనంలోకి ప్రవేశించిన నిరసనకారులు.. ఒక గదిలో అలమారా తలుపు తెరవగా, దాని వెనుక ఉన్న దారి గుండా వెళ్తే అండర్‌గ్రౌండ్‌లో ఒక హైసెక్యూరిటీ బంకర్ బయటపడింది. రాజపక్స ఆ దారి నుంచే పరారై ఉంటారని ప్రజలు భావిస్తున్నారు. అక్కడ బంకర్ ఉన్న విషయాన్ని శ్రీలంక స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందం ధ్రువీకరించింది.