ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్లను పూర్తిగా నిషేధించాలి
1 min read– పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
– జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్
పల్లెవెలుగు, వెబ్ నంద్యాల : పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నవంబర్ 1వ తేదీ నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్ షాపుల నిషేధానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్ ప్రింటింగ్ యజమానులకు సూచించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్ ల నిషేధంపై బ్యానర్ ల ప్రింటింగ్ యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ వచ్చే నెల ఒకటో తేదీ నుండి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్ షాపుల నిషేధానికి సహకరించాలని సంబంధిత దుకాణ యజమానులను కోరారు. నంద్యాల జిల్లాలో దాదాపు 31 ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్ ప్రింటింగ్ మిషన్లు వున్నాయని… ప్రభుత్వ నిబంధనల అనుసరించి నవంబర్ ఒకటో తేదీ నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్ ప్రింటింగ్ పూర్తిగా నిలుపుదల చేయాలన్నారు. ప్రింటింగ్ మిషన్ ల నిర్వాహకులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్ ల వల్ల వాతావరణం కలుషితం అవుతున్న నేపద్యంలో ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తించి ప్రభుత్వానికి అనుగుణంగా నడుచుకోవాలన్నారు. మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గాలు తెలియజేస్తామన్నారు. జిల్లాలో ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్ లను పూర్తిగా నిషేధించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. పరిశ్రమల శాఖ ద్వారా పిఎంఈజిఎస్ వై కింద రుణాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బ్యాంకుల నుండి షురూటీలు కూడా సరళీకృతం చేస్తామని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సైంటిఫిక్ ఆఫీసర్ గణేష్ కుమార్, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీనివాస యాదవ్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ వెంకటనారాయణ, ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్ల ప్రింటింగ్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.