24 వరకు పోలింగ్ స్టేషన్ ల మార్పులకు అవకాశం…
1 min readజిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన…
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : ఫిబ్రవరి – 24 వ తేదీ వరకు పోలింగ్ స్టేషన్ ల మార్పులకు అవకాశం ఉందని జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేశారు. బుధవారం సాయంకాలం తన క్యాంపు కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పోలింగ్ స్టేషన్ ల మార్పు ఒక ప్రదేశము నుండి వేరొక ప్రదేశానికి ఓటర్లకు దగ్గరగా ఉండేలా మార్పునకు అవకాశం ఉన్నదని, ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 24వ తారీఖు లోపల వ్రాతపూర్వకంగా తెలియజేయవలసిందిగా రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. ప్రజలు పోలింగ్ స్టేషన్ చేరుకోవడానికి ఏమైనా ఇబ్బందులు ఉన్న ప్రదేశాలలో మరియు రెండు కిలోమీటర్లు పైబడి దూరం ఉన్న పోలింగ్ స్టేషన్ లను మార్చుకునే అవకాశం , పోలింగ్ స్టేషన్ ల పేర్లు కూడా మార్చుకోవచ్చని తెలిపారు.. 1500 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నచోట అదే స్థానంలో సహాయక ( ఆక్సిలరీ ) పోలింగ్ స్టేషన్ ఏర్పాటుకు అవకాశం ఉన్నదని తెలియజేశారు. పోలింగ్ స్టేషన్ లకు సంబంధించి సమస్యలను వెంటనే వ్రాతపూర్వకంగా సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.కర్నూలు పట్టణము కు దగ్గర లో ఉన్న రాయలసీమ యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్స్ , కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలియజేశారు. ఎన్నికల విధుల కు కేటాయించబడ్డ సిబ్బంది అందరికీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల మేరకు మాస్టర్ ట్రైనర్స్ ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అవసరమైన కమిటీలను ఏర్పాటు చేశామని తెలియజేశారు.ఈ సమావేశానికి బహుజన పార్టీ తరఫున ఎ.అరుణ్ కుమార్, భారతీయ జనతా పార్టీ తరఫున పి. టి. సాయి ప్రదీప్ , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కె.పుల్లారెడ్డి , తెలుగుదేశం పార్టీ తరఫున ఎల్.వి. ప్రసాద్ మరియు ఎలక్షన్ సెల్ సూపరిండెంట్ మురళి పాల్గొన్నారు.