పొట్టి శ్రీరాములు జయంతిని అధికారికంగా నిర్వహించకపోవడం బాధాకరం..
1 min readటిడిపి అభ్యర్థి టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం బాధాకరమని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భరత్ అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా నగరంలోని చిన్న అమ్మవారి శాల వద్ద ఉన్న ఆయన విగ్రహానికి టి.జి భరత్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు కృషి, త్యాగం వల్లే తెలుగు మాట్లాడే వాళ్లమంతా కలిసి ఉన్నామన్నారు. ఆయన ఆంధ్రరాష్ట్ర సాధన కోసం జన్మించిన మహనీయుడని కొనియాడారు. ఈయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక అధికారికంగా నిర్వహించేందుకు తాను చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా 58 అడుగుల విగ్రహం ఏర్పాటుతో పాటు, గన్నవరం విమానాశ్రయానికి పొట్టి శ్రీరాములు పేరు పెట్టే విధంగా పార్టీ అధినేతతో చర్చిస్తానని చెప్పారు. పొట్టి శ్రీరాములుకు తెలుగుదేశం ప్రభుత్వంలోనే సముచిత గౌరవం కల్పిస్తామన్నారు. ఇక ఎన్టీఆర్‌తో పాటు పొట్టి శ్రీరాములుకు భారతరత్న అవార్డులు రావాలన్నారు. రాబోయే టిడిపి, జనసేన, బీజేపీ ప్రభుత్వంలో ఇందుకోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు శేషగిరి శెట్టి, విఠల్ శెట్టి, మురళీ, నాగ వీరాంజనేయులు, చిన్న అమ్మవారి శాల సెక్రటరీ నంద కిషోర్, వివిధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.