పొట్టి శ్రీరాములు అమరుడు..
1 min read– ఆయన త్యాగఫలితమే తెలుగు రాష్ట్రాలు
– ఉప ముఖ్యమంత్రి ఎస్ బి అంజాద్ బాషా
పల్లెవెలుగు వెబ్, కడప: తెలుగు మాట్లాడే వారందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలని .. తన త్యాగాల ఫలితంగా తెలుగు రాష్ట్రం సాధించిన మహోన్నత వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి యస్ బి అంజాద్ భాష అన్నారు. మంగళవారం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని స్థానిక గోకుల్ లాడ్జ్ కూడలి నందు అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్ బి అంజాద్ బాషా మాట్లాడుతూ.. ఆనాడు మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగువారినంతా ఏకం చేస్తూ ఖచ్చితంగా తెలుగు మాట్లాడే వారందరికీ కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ తన ప్రాణాన్ని త్యాగం గా పెట్టి ఈ రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. అలాంటి మహోన్నత వ్యక్తిని మనమందరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం.. మహోన్నత వ్యక్తి జయంతి ఉత్సవాలను ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోందన్నారు. అనంతరం మాజీ నగర మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ.. దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో నెల్లూరు జిల్లా ను పొట్టి శ్రీరాములు జిల్లా గా నామకరణం చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి, వర్ధంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకుకులు పులి సునీల్, నిత్యానంద రెడ్డి, హరూన్ బాబు, కె. బాబు, జహీర్, సురేష్, బలస్వామి రెడ్డి, రహీం, నాయక్ తదితరులు పాల్గొన్నారు.