పొట్టి శ్రీరాములు త్యాగాలు మరువలేనివి .. మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలు మరువలేనివని, మర్చిపోకూడనివని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా టీజీ వెంకటేష్ ఈరోజు స్థానిక పూల బజార్ నందు ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతూ 53 రోజులపాటు పచ్చి మంచినీరు కూడా ముట్టుకోకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి, ఆత్మార్పణం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు అని అన్నారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో తెలుగువారు మెజార్టీగా ఉన్నప్పటికీ తమిళుల పెత్తనం తెలుగువారిపై అధికంగా ఉండేదని, ఎన్నో అవమానాలు భరించాల్సి వచ్చేదని టీజీ వెంకటేష్ తెలిపారు. వీటిని భరించలేక తెలుగు వారికి ఒక గుర్తింపు, ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని టీజీ వెంకటేష్ కొనియాడారు. అటువంటి పొట్టి శ్రీరాములు ను గౌరవించడంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగాలను ముందు తరాలకు తెలిపాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నప్పటికీ, ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తున్నాయని ఆయన విమర్శించారు. తెలుగు వారంతా ఒక్కటే అన్న నినాదంతో పోరాడిన పొట్టి శ్రీరాములు విగ్రహం అన్నది తెలంగాణలో లేకుండా చేశారని టీజీ తెలిపారు. తెలుగువారి కోసం ఆత్మాపణ చేసిన పొట్టి శ్రీరాములు కు ఎవరైతే సరైన గౌరవం, మర్యాద ఇస్తారో వారికే ప్రజలు పట్టం కడతారని టీజీ వెంకటేష్ తెలిపారు. ఇప్పటికైనా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఉత్సవాన్ని, పొట్టి శ్రీరాములు జీవిత చరిత్రను రాబోయే తరాలకు తెలిసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని టీజీ వెంకటేష్ కోరారు. ఈ కార్యక్రమంలో శేషగిరి శెట్టి వాయుగండ్ల సుబ్బారావు విటల్ శెట్టి శ్రీనివాస్ పాల్ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.