ప్రాణాలిస్తాం.. భూములివ్వం.!
1 min read– హంద్రీనీవా ఫేజ్–2కు భూ సేకరణ పనులు నిలిపివేయాలి
– మల్యాల రైతుల డిమాండ్
పల్లెవెలుగువెబ్, నందికొట్కూరు: హంద్రీనీవా ఫేజ్ 2 నిర్మాణం కోసం ప్రభుత్వం బలవంతపు భూ సేకరణ పనులు నిలిపివేయాలని, తమ సాగు భూములను ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఇచ్చే ప్రసక్తి లేదని మల్యాల రైతులు స్పష్టం చేశారు. భూములను బలవంతంగా లాక్కుంటే.. చూస్తూ ఊరుకోమని, ఆత్మబలి దానానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. గురువారం ప్రాణాలైనా అర్పిస్తాం.. భూమిలు ఇవ్వం.. అంటూ మల్యాల రైతులు ఉద్యమబాట పట్టారు. హంద్రీ నీవా భూ పోరాట కమిటిగా ఏకమయ్యారు. 1978లో నీరు నిల్వ కోసం 616 ఎకరాల భూమిని శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా తీసుకున్నారు నీరు తగ్గిన తర్వాత మీ భూములను మీరు సాగు చేసుకోండని చెప్పారు. 98 జీవో ప్రకారం ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలోని కొద్ది మందికి మాత్రమే లస్కర్ పోస్టులు ఇచ్చి అరకొర నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నారు.
రైతులు.. త్యాగధనులు: 1981లో నందికొట్కూరు పట్టణానికి తాగునీటి కోసం దాదాపు 150 ఎకరాలు సేకరించారు. 2006లో హంద్రీనీవా కోసం 500 ఎకరాలు ముచ్చుమర్రి నుండి లింకు ఛానల్ కు మరో 500 ఎకరాల భూములు, పంప్ హౌస్, సబ్ స్టేషన్ పార్కింగ్ పేరుతో 150 భూములను ప్రభుత్వం లాక్కుంది. దాదాపు ఇప్పటివరకు రెండు వేల ఎకరాల దాకా రెండు కార్లు పంటలు పండే భూములు తీసుకున్నారు. రైతులు త్యాగాలు చేశారు. వీటి మూలంగా గ్రామంలో వ్యవసాయ కూలీలకు పని లేకుండా పోయింది. నేడు ఉన్న కొద్దిపాటి భూమిని హంద్రీనీవా ఫేస్ టు చానల్ ను ఏర్పాటు చేయాలనే పేరుతో గ్రామ రైతులకు తెలియకుండా సర్వే చేయడం విచారకరమన్నారు. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టరు గ్రామ రైతులకు తగు న్యాయం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో గ్రామ రైతులు సర్పంచ్ ఎల్ల నాయుడు, శ్రీనివాసులు గౌడ్ ,బోయ వెంకటరమణ, ఖాజా మోదిన్, గూడుసా, మంజు, హుస్సేన్ పీరా, జమ్మన్న తదితరులు పాల్గొన్నారు.