అకాల వర్షం.. అపారనష్టం..
1 min read– దెబ్బతిన్న అరటితోటను పరిశీలించిన ప్రభుత్వ విప్
– రైతులను ఆదుకుంటామని హామీ
పల్లెవెలుగు వెబ్, చిట్వేలు: మండలంలో కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. ఓబులవారిపల్లి మండలం ముక్కవారి పల్లి, పెద్ద ఓరంపాడు, ఓబులవారిపల్లె కురిసిన గాలివానకు దెబ్బతిన్న పంటలను శుక్రవారం ఆయన రైతులు, వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారులుతో కలసి పరిశీలించారు. దెబ్బతిన్న పంటలను చూసి ఆయన చలించిపోయారు. అనంతరం రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మండలంలో కురిసిన వడగండ్ల వానకు ,గాలికి అరటి, తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నష్ట పోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం ఆదుకుంటుందని బాధిత రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సచివాలయంలో గ్రామ వ్యవసాయ కార్యదర్శి వద్ద నష్టపోయిన ప్రతి రైతు పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే రాజంపేట సబ్ కలెక్టర్ కు ఫోన్ చేసి నష్టపోయిన ప్రతి ఒక రైతుకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని, ఆన్లైన్ లో పేరు లేని రైతులకుకూడా నష్ట పరిహారం అందేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న మండల కన్వీనర్ కిషోర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, స్థానిక నాయకులు, రైతులు, మండల అధికారులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.