‘వెన్యూ కన్వెన్షన్’లో వంద పడకలు సిద్ధం
1 min read– జీజీహెచ్‌కు అనుసంధానం
– కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్
పల్లెవెలుగు వెబ్, విజయవాడ : కోవిడ్ స్ట్రెయిన్ కారణంగా అత్యవసర వైద్యసేవలు అందించేందుకు మరో 100 పడకలు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ తెలిపారు. స్థానిక కొత్త గవర్నమెంట్ హాస్పటల్ సమీపంలో ఉన్న వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో బెడ్లు, ఆక్సిజన్ సరఫరా కోసం ఆక్సిజన్ పైపులు, తదితర ఏర్పాట్లను జిజిహెచ్ సూపరింటెండెంట్‌తో కలిసి కలెక్టరు పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టరు ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి పెద్ద ఎ త్తున భరోసా కల్పించేలాగా మరిన్ని పడకలను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. అందులో భాగంగా స్థానిక వెన్యూ కన్వెన్షన్ సెంటరులో ఆక్సిజన్ సరఫరాతో కూడిన బెడ్లను అత్యవసర వైద్యచికిత్సలు అందించాల్సిన వారికోసం అందుబాటులోనికి తీసుకువస్తున్నామన్నారు. ఈకోవిడ్ వైద్య సేవా విభాగం ప్రభుత్వాసుపత్రికి అనుసంధానంగా పనిచేస్తుందన్నారు. ఇందుకు అవసరమైన వైద్యులను ప్రైవేట్ ఆసుపత్రులలో, మెడికల్ అసోసియేషన్ వారితోనూ సంప్రదించి 20 నుండి 30 మంది డాక్టర్లను అందుబాటులోనికి తీసుకువస్తామన్నారు. 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉండే విధంగా షిప్టుల విధానాన్ని అమలు చేస్తామన్నారు . వియంసి ఆధ్వర్యంలో ఆక్సిజన్ సరఫరా కోసం పైపులైను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కలెక్టరు వెంట జిజిహెచ్ సూపరింటెండెంట్ డా. కె. శివశంకరరావు, వెన్యూ కన్వెన్షన్ సెంటర్ మేనేజరు రాజు, యంఆర్డీ ఎల్లారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.