మూడు రాజధానుల కోసం… త్యాగానికి సిద్ధం..!
1 min readకర్నూలు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్
పల్లెవెలుగు వెబ్: పాదయాత్ర సమయంలో అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయం మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని, అభివృద్ధి వికేంద్రీకరణ, రాజధానుల కోసం 151 మంది ఎమ్మెల్యేలు ఎలాంటి త్యాగానికైనా సిద్ధమన్నారు కర్నూలు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్. ఆదివారం తన ఛాంబరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభినందిస్తున్నారన్నారు. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఒకే ప్రాంతం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించడం స్వార్థబుద్ధికి నిదర్శనమన్నారు. దొంగ రైతులతో పాదయాత్ర చేయించడం సిగ్గుచేటని విమర్శించారు. వీరికి సీపీఐ రామకృష్ణ మద్దతు ఇవ్వడం చూస్తుంటే… అమరావతి భూముల్లో వాటా ఉన్నట్లు తెలుస్తోందని ఆరోపించారు. రాయలసీమ అభివృద్ధి, న్యాయ రాజధాని కోసం మేము పోరాటాలు చేస్తే కనీసం ఒక్క మాటైనా మాట్లాడారా అంటూ సిపిఐ రామకృష్ణ పై మండిపడ్డారు. త్వరలోనే రాయలసీమలో జేఏసీ ఏర్పాటు చేసి న్యాయ రాజధాని కోసం తాము కూడా పోరాటం చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.