విద్యాధికారులపై ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆగ్రహం
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: జిల్లా విద్యాధికారులపై ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నాడు నేడు ద్వారా కోట్ల నిధులు వెచ్చిస్తున్నా అధికారుల తీరు వలన ఫలితాలు శూన్యమని ప్రిన్సిపల్ సెక్రెటరీ విద్యాధికారులపై మండిపడ్డారు. నాడు నేడు పనులలో నాణ్యత లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని తెలిపారు. నిధుల దుర్వినియోగంపై జిల్లా విద్యాధికారులు దృష్టి సారించాలన్నారు. శనివారం మండలంలోని హోసూర్ గ్రామంలో జడ్పీహెచ్ హైస్కూల్లో ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఫేస్ వన్ నాడు నేడు కింద విడుదల చేసిన నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. గోడలకు వేసిన రంగులు తేలిపోయి దర్శనమిస్తున్నాయని, ఈ నిధులను కాంట్రాక్టర్లు మింగేసారా అని డీఈవో రంగారెడ్డిని ప్రశ్నించారు. విద్యార్థులకు కనీసం బేసిక్ నాలెడ్జి కూడా లేనివిధంగా చదువులను నేర్పిస్తున్న మిమ్ములను దేవుడు కూడా క్షమించడని విద్యాధికారులను దుయ్యపట్టారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అందుకు భిన్నంగా విద్యాధికారులు వ్యవహరించడం ఏంటన్నారు. ఇలా వ్యవహరిస్తున్న డీఈవో, డిప్యూటీ డిఈఓ, ఎంఈఓ లపై నెలలోపు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపాధ్యాయులు తమ విధుల పట్ల నిర్లక్ష్య ధోరణి వీడాలన్నారు. లేనియెడల చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యాధికారులు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నెరవేర్చే విధంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు తమ తీరు మార్చుకుని విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి కృషి చేయాలన్నారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ పత్తికొండ నియోజకవర్గం లోని పలు గ్రామాల పాఠశాలలు సందర్శించి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. స్థానిక గురుకుల పాఠశాల మోడల్ పాఠశాలను పరీక్ష కేంద్రాలను సందర్శించి పరిస్థితులను పర్యవేక్షించారు. ఆయన వెంట జిల్లా విద్యాధికారులు డివిజన్ మండల విద్యాశాఖ అధికారులు ఉన్నారు.