‘ప్రైవేట్’ విద్యాసంస్థలలో అధిక ఫీజులు నియంత్రించండి
1 min readరాయలసీమ యువ విద్యార్థి సమాఖ్య (ఆర్. వై. ఎస్. ఎఫ్) :
పల్లెవెలుగు: ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలలో అధిక ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ యువ విద్యార్థి సమాఖ్య ఆర్. వై. ఎస్. ఎఫ్ ఆధ్వర్యంలో పూర్ణ అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్. వై. ఎస్. ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రంగముని నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. రాయలసీమలో సరిగా వర్షాలు లేక రాయలసీమ ప్రజలు పేదరికంతో అల్లాడిపోతున్న సమయంలో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యను వ్యాపారం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వేలు, లక్షలు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల జేబులు గుల్ల చేస్తున్నారని అన్నారు. చాలా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేవని విద్యార్థులకు అనుగుణంగా ఆట స్థలం లేకపోయినా, కొన్ని విద్యాసంస్థలకు అనుమతులు లేకపోయినా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థల యాజమాన్యాలు చదువులు కొనసాగిస్తూ ధనార్జనే ధ్యేయంగా భావిస్తున్నారని అన్నారు. విద్యాసంస్థల యాజమాన్యాలకు డబ్బులపై ఉన్న ఆలోచన విద్యార్థుల భవిష్యత్తుపై లేదని అన్నారు. పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత విద్యను ప్రతి ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలలో సక్రమంగా సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధిక ఫీజులు పెట్టి విద్యార్థులను తల్లిదండ్రులను మభ్యపెడితే ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసే వరకు ఆర్ వై ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో ఉదృతమైన పోరాటాలు చేస్తామని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆర్ వై ఎస్ ఎఫ్ నాయకులు భరత్ , సోమశేఖర్, చంద్ర, వెంకటేశ్, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.