ఉద్యమిస్తేనే సమస్యల పరిష్కారం…
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఉద్యోగులు ఉపాధ్యాయులు కలిసికట్టుగా ఉద్యమిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఫ్యాప్టో నాయకులు సూచనలు చేశారు. శనివారం స్థానిక నాలుగు స్తంభాల కూడలి వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయులు తమ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో సీనియర్ నాయకులు కుంపటి నారాయణ, కొత్తపల్లి సత్యనారాయణ, భాస్కర్ చందు నాయక్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులపై అణచివేత ధోరణి అవలంబిస్తోందన్నారు. బెదిరిస్తూ భయపెడుతూ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. ఇలాంటి పరిస్థితులలో ఉద్యోగ ఉపాధ్యాయులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఉద్యోగ ఉపాధ్యాయులకు వరాలు కురిపించాలని తదనంతరం తమపై నిర్బంధాలకు గురి చేస్తున్నారని దుయ్యపట్టారు. నెలనెలా సక్రమంగా జీతాలు అందక ఉద్యోగులు ఉపాధ్యాయులు అభద్రతాభావంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఓపిఎస్ స్థానంలో జిపిఎస్ తీసుకురావడం ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేయడమేనని అన్నారు. తమకు కావలసింది సిపిఎస్ రద్దుచేసి ఓ పి ఎస్ ను తీసుకురావాలన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులందరూ సంఘటితంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తే తప్ప మన సమస్యలు పరిష్కారం కావని వారు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఈనెల 25న ఫ్యాప్టో ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ తలపెట్టినట్లు చెప్పారు. చలో కలెక్టరేట్ ప్రోగ్రాంను ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల అందరూ విజయవంతం చేయాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం నాలుగు స్తంభాల కూడలి వద్ద దాదాపు అరగంట పాటు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు రామ్మోహన్ రెడ్డి, రంగారెడ్డి, రమణ, రామ్ మౌళి, నాగభూషణం, రంగస్వామి, వేణు తదితరులు పాల్గొన్నారు.