PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రామ స్థాయిలోనే సమస్యలు పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్

1 min read

– సచివాలయ సిబ్బందికి దిశానిర్దేశం
– గ్రీవెన్స్ నమోదును క్షేత్ర స్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : గ్రామ స్థాయిలోనే పరిష్కరించాల్సిన సమస్యలను ఇక్కడే నివృత్తి చేసేలా సచివాలయ సిబ్బందికి జిల్లా కలెక్టర్ డా.జి.సృజన దిశానిర్దేశం చేశారు.బుధవారం ఓర్వకల్లు మండల కేంద్రంలోని గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.జి.సృజన మాట్లాడుతూ సచివాలయంలో ఏర్పాటు చేసిన సంక్షేమ క్యాలెండర్ చాలా పాతగా ఉందని నూతనంగా ప్రభుత్వం విడుదల చేసిన సంక్షేమ క్యాలెండర్ ను ఏర్పాటు చేయాలన్నారు. సచివాలయ పరిధిలో ఎన్ని పథకాలు అందిస్తున్నారని సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా సచివాలయంలో స్పందన, రెవెన్యూ సమస్యలకు సంబంధించి సచివాలయాలకు అర్జీదారులు వచ్చినప్పుడు ఏ విధంగా సంబంధిత అర్జీని స్పందన పోర్టల్ లో నమోదు చేస్తారని పూర్తి స్థాయిలో డిజిటల్ అసిస్టెంట్ ద్వారా నమోదు ప్రక్రియను జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. సచివాలయ పరిధిలో ఎంత మంది స్త్రీలు ఉన్నారని వారిలో ఎంత మంది గర్భిణీ స్త్రీలు ఉన్నారని ఆరోగ్య కార్యకర్తను అడుగగా 70 మంది గర్భిణీ స్త్రీలు ఉన్నారని వారిలో ఎవరైనా రక్తహీనతతో ఉన్నారా అని, ఉంటే వారిపై ప్రత్యేక దృష్టి ఉంచడంతో పాటు వారికి అవసరమైన పౌష్టికాహారం అందజేయాలన్నారు. ఈ మండలంలో ఏమైనా బాల్యవివాహాలు జరుగుతున్నాయా అని వాలంటీర్లను అడిగి తెలుసుకున్నారు. గ్రామాలలో ఎన్ని రకాల రోడ్లు ఉన్నాయి, ఎన్ని వీధిదీపాలు ఉన్నాయి, అన్ని ఇళ్లకు వాష్ రూమ్స్ ఉన్నాయా అని పంచాయతీ కార్యదర్శిని జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మండల స్థాయి అధికారులు సచివాలయ తనిఖీలకు వచ్చినప్పుడు తప్పనిసరిగా రిజిస్టర్ తనిఖీ చేయాలన్నారు. గ్రామాలల్లో అందుతున్న పథకాలపై సంక్షేమ కార్యదర్శి జిల్లా కలెక్టర్ కు వివరిస్తూ ఈ నెలలో 601 పెన్షన్ లు మంజూరు చేశామని, వాహన మిత్ర ద్వారా 15 మంది లబ్ధి పొందారని, చేయూత ద్వారా 308 లంది లబ్ధి పొందారని, చేదోడు ద్వారా 54 మంది లబ్ధి పొందారని, ఈ బీసీ నేస్తం ద్వారా 38 మంది లబ్ధి పొందారని, అమ్మ ఒడి ద్వారా 453 మంది లబ్ధి పొందాలని తెలిపారు. గ్రామంలో 5 అంగన్వాడీలు, మూడు స్కూళ్ళు ఉన్నాయని ప్రతివారం వాటిని సందర్శించి వాటిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని మహిళా సంక్షేమ కార్యదర్శి జిల్లా కలెక్టర్ కు వివరించారు.అనంతరం జిల్లా కలెక్టర్ సచివాలయ సిబ్బందిని పలు సూచనలు చేస్తూ సచివాలయ సిబ్బంది పథకాల పట్ల పూర్తి అవగాహనతో ఉండడమే కాక మండల స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలు జిల్లా స్థాయికి ఎందుకు వస్తున్నాయని సచివాలయ సిబ్బందిని ప్రశ్నించారు. అందుకు అవసరమైతే మీకు శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. రెవెన్యూ కు సంబంధించి చిన్న అడంగల్ సమస్య కూడా జిల్లా స్థాయికి వస్తుందని అలా కాకుండా మండల స్థాయిలో పరిష్కరించే సమస్యల పట్ల ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలన్నారు. 70 నుంచి 80 శాతం సమస్యలు ఇక్కడే పరిష్కరిస్తాం అనే భరోసా ఇవ్వాలన్నారు.కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట ఓర్వకల్లు తహశీల్దార్ శివప్రసాద్ రెడ్డి, ఎంపిడిఓ శివనాగప్రసాద్, డ్వామా పిడి అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author