ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని వినతి
1 min readమున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణకు వినతి..
ఏపి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాస్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమ్మె సందర్భంగా జరిగిన ఒప్పందం మేరకు కార్మిక సంఘాలకు ప్రభుత్వం ఇచ్చిన జీవోలను తక్షణం అమలు చేయాలని ఏపి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి)జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం ఏపి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు.అనంతరం భజంత్రీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్, జనవరి మాసాలలో మున్సిపల్ కార్మికుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం చర్చలు జరిపి 2 జీవోలు విడుదల చేసిందన్నారు. 17 రోజుల సమ్మె కాలానికి జీతం ఇవ్వాలని, శానిటేషన్ వర్కర్లకు సంక్రాంతి పండుగకు ప్రభుత్వం ప్రకటించిన రూ.1000 చొప్పున ఇస్తామని ఇచ్చిన హామీని తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అపరిష్కృతంగా ఉన్న హెల్త్ అలవెన్సులు, విలీనమైన 7 పంచాయతీ సిబ్బంది జీతాలు, శానిటేషన్ వర్కర్లకు మార్చిలో చెల్లిస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఏలూరు నగర పాలక సంస్థలో శానిటేషన్ సంస్థలో పనిచేస్తున్న వర్కర్లకి రూ.15 వేల జీతం ఉన్న కారణంగా ప్రభుత్వ పథకాలు, వారి కుటుంబ పెన్షన్లు అమలు కావడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి శానిటేషన్ వర్కర్లకు కూడా ప్రభుత్వ పథకాలు అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. సిబ్బందికి పనిముట్లు అంద చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వై.శివకుమార్, దొడ్డి గర్ల నాగబాబు, కిలారి వెంకన్న బాబు, బట్టు కృష్ణ, పేడారి వంశి, సొలోమోన్ రాజు, డి రవీంద్ర, కారే మరియ దాస్, బట్టు మనోజ్, తదితరులు పాల్గొన్నారు.