ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించండి
1 min read
దేశవాళి వరి వంగడాలను సాగుచేయండి
ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. శనివారం గోస్పాడు మండలం జిల్లె గ్రామంలోని రైతు బాల మద్దిలేటి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి ప్రకృతి వ్యవసాయ విధానాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో అధిక లాభాలనిచ్చే ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండించడం వల్ల అధిక లాభాలు రావడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించిన వారమవుతామన్నారు. దేశవాళి వరి వంగడాలను సాగుచేసే విధానం, ప్రకృతి వ్యవసాయ నిబంధనలు పాటించడం ద్వారా రైతులకు వచ్చే నికర ఆదాయాన్ని బాల మద్దిలేటిని అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో రసాయనిక ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించి సేంద్రియ పద్ధతులను అవలంబించడం ప్రధాన లక్ష్యం కావాలన్నారు. ఈ విధానంలో ఉపయోగించే జీవామృతం, ఘన జీవామృతం, బీజామృతం వంటి ప్రాకృతిక ఇన్పుట్లు నేల సారవంతతను పెంచి, పంట దిగుబడిని మెరుగుపరచడంలో సహాయపడతాయన్నారు. దేశవాళి వరి వంగడాలను పెంచడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడంతో పాటు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలకు అందించవచ్చని తెలపారు. మాపిల్లై సాంబా , శివన్ సాంబా, పుంగర్ ,నల్ల బియ్యం, కుజుపటలియా , నవర బియ్యం , చిట్టి ముత్యాలు, మైసూర్ మల్లిగై, గోదావరి ఇసుకలు , రత్నచోడి, రక్తశాలి వంటి దేశవాళి వరి వంగడాలను సాగుచేస్తున్న విధానాన్ని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.అలాగే డ్రోన్ ఆపరేషన్ పై డ్రోన్ పైలట్ గా శిక్షణ పొందిన సునీత ప్రకృతి వ్యవసాయంలో కీలకమైన జీవామృతం పిచికారిని డ్రోన్ ద్వారా కలెక్టర్ సమక్షంలో ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. డ్రోన్ వినియోగం ద్వారా, వ్యవసాయ కార్మిక లోటును అధిగమించి, సమయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు, సమర్థవంతంగా పెస్టిసైడ్, జీవామృతాన్ని పంటలపై పిచికారీ చేయవచన్ని అలాగే ఈ వినూత్న ప్రయోగం ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తృత స్థాయిలో అమలు చేయడానికి అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. బాల మద్దిలేటి ఇన్పుట్ షాపును కూడా సందర్శించి, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించి, రైతులకు అధిక ఆదాయాన్ని అందించేందుకు అవసరమైన మార్గదర్శకాలు సమగ్రంగా రూపొందించుకోవాలన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృత స్థాయిలో ప్రోత్సహించేందుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు, శాస్త్రీయ పరిశోధనలు, మార్కెట్ లింకేజెస్ అవసరమని వ్యవసాయ అధికారులు కలెక్టర్ వివరించారు. దేశవాళి వరి వంగడాల పెంపకం ద్వారా భవిష్యత్తులో వ్యవసాయంలో స్వావలంబన సాధించవచ్చని రైతులు తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, ఆళ్లగడ్డ డివిజన్ ఎడిఏ రామ్మోహన్ రెడ్డి, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్, మండల వ్యవసాయ అధికారి, గ్రామ సర్పంచు, ఇతర వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
