గ్రేడ్ -4 పంచాయితీ కార్యదర్శులకు పదోన్నతి
1 min read– పదోన్నతులు బాధ్యత పెంచుతాయి
– ప్రమోషన్ పొందిన ఉద్యోగులందరూ అంకిత భావంతో పనిచేయాలి
– జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : పదోన్నతి పొందిన ఉద్యోగులందరూ అంకిత భావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పంచాయితీ విభాగంలో పనిచేస్తున్న 22 మంది గ్రేడ్-4 పంచాయితీ కార్యదర్శులకు గ్రేడ్-3 పంచాయితీ కార్యదర్శులుగా పదోన్నతి కల్పిస్తూ జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు స్ధానిక కలెక్టరేట్ లో మంగళవారం సంబంధిత పదోన్నతి ఉత్తర్వు పత్రాలను సంబంధిత పంచాయితీ కార్యదర్శులకు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇంత మందికి ఒకేసారి పదోన్నతులు కలగడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకోసం చేసే పని దైవంతో సమానమన్నారు. పదోన్నతులు పొందిన ఉద్యోగులందరూ అంకితభావంతో పనిచేయాలన్నారు. పదోన్నతి పొందిన వారు వెంటనే తమకు నిర్ధేశించిన స్ధానాల్లో ఎంపిడివోలకు రిపోర్ట్ చేయాలన్నారు. పదోన్నతి పొందిన వారిలో 19 మంది ప్రస్తుతం వారు పనిచేస్తున్న ప్రదేశంలోనే విధులు నిర్వర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయితీ అధికారి జి.వి.కె. మల్లిఖార్జునరావు తదితరులు పాల్గొన్నారు.