బంగ్లాదేశ్‌లో హిందువులకు రక్షణ కల్పించండి
1 min read– విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సహకార్యదర్శి ప్రాణేష్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: దేశ ప్రధాని నరేంద్రమోదీ వేల కోట్ల రూపాయలు విలువైన కరోన వ్యాక్సిన్‌ను బంగ్లాదేశ్‌కు ఉచితంగా పంపిణీ చేస్తే… హిందూ–సిక్కులపై దాడులకు దిగడం దారుణమన్నారు విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సహకార్యదర్శి ప్రాణేష్. హిందూ సాంస్కృతిక సంప్రదాయాలు, సామాజిక సంబంధాలు కలిగిన బంగ్లాదేశ్‌లో అత్యల్ప సంఖ్యలో ఉన్న హిందూ సోదరులపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, అక్కడ హిందువులకు రక్షణ కల్పించాలని కోరారు. బంగ్లాదేశ్‌లో గత వారం నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో హిందూదేవాలయాల మండపాలపై దాడులు, దేవుడి విగ్రహాలను పగలగొట్టడం, వాటిని విచ్చిన్నం చేయడం… వంటి అరాచకాలకు ఇస్లామిక్ జిహాదీలు చేస్తున్నారని ఆరోపించారు.
ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లచే పాలించబడడం మొదలుపెట్టినప్పటి నుండి, ఇతర పొరుగు దేశాలలో కూడా జిహాదీ తీవ్రవాదుల దాడులు క్రమంగా పెరిగాయన్నారు. బంగ్లాదేశ్ హిందువులకు రక్షణ కల్పించాలని.. ఈ మేరకు ఐక్యరాజ్యసమితితో చర్చించి.. బంగ్లాదేశ్‌పై ఒత్తిడి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర గవర్నర్, రాష్ట్రపతికి వినతిపత్రాలు పంపామన్నారు. అంతకు ముందు బంగ్లాదేశ్ హిందువులపై దాడులకు నిరసనగా కలెక్టరేట్ ముందు ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం డీఆర్ఓ పుల్లయ్యకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో విశ్వహిందూపరిషత్ జిల్లా కార్యాధ్యక్షలు కే.కృష్టన్న , బజరంగ్దళ్ రాష్ట్ర కన్వీనర్ ప్రతాపరెడ్డి, విభాగ్ కన్వీనర్ నీలి నరసింహ, జిల్లా సహకార్యదర్శి శివప్రసాద్, జిల్లా కన్వీనర్ రామకృష్ణ, నగర కన్వీనర్ ప్రసన్నకుమార్ రెడ్డి, సాప్తాహిక్ మిలన్ కన్వీనర్ సాయిరామ్ నగర కార్యదర్శి మాళిగి భానుప్రకాష్, ఇతర ప్రఖంఢ బజరంగ్దళ్, విశ్వహిందూ పరిషత్ ,బీజేపీనాయకులు కగ్గోలు హరీష్ బాబు,విక్కీ వెంకటేశ్,మదనమొహనాచారి,గణేష్,వాసవీ సేవాదళ్ కార్యకర్తలు, పాల్గొన్నారు.