ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వెలుగులు పంచిన శ్రీశైలం ప్రాజెక్టు భధ్రతను కాపాడండి
1 min read
ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేసిన బొజ్జా దశరథరామిరెడ్డి.
కర్నూలు, న్యూస్ నేడు: శ్రీశైలం ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్దికి ఎంతో దోహదపడిందనీ, అత్యంత కీలకమైన ఈ శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదం అంచున వుండటానికి ఉభయ తెలుగు రాష్ట్రాల పాలకుల నిర్లక్ష్య వైఖరే కారణమని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ఆరోపించారు.సిద్దేశ్వరం అలుగు ప్రజా శంఖుస్థాపన 9 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 31 న సంగమేశ్వరంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆద్వర్యంలో నిర్వహించే ప్రజా బహిరంగసభ విజయవంతానికై నంద్యాల జిల్లా మహానంది మండల పరిధిలోని పలు గ్రామాలలో బుధవారం ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు.ఈ సందర్భంగా దశరథరామిరాడ్డి మాట్లాడుతూ..2009 వ సంవత్సరంలో వచ్చిన భారీ వరదలకు శ్రీశైలం రిజర్వాయర్ ప్లంజ్ ఫూల్ దెబ్బతినిందని..రిజర్వాయర్ భధ్రత కోసం తక్షణమే మరమ్మత్తులు చేపట్టి రిజర్వాయర్ ను కాపాడమని రాయలసీమ సాగునీటి సాధన సమితి గత పన్నెండు సంవత్సరాలుగా ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ పాలకులు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణిని అవలంబించారని విమర్శించారు. 2014 సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటినుంచి అటు తెలంగాణా పాలకులు మిషన్ భగీరథ, కాళేశ్వరం ల మీద దృష్డి పెడితే ఇటు ఆంధ్రప్రదేశ్ పాలకులు పోలవరం మీద దృష్టి పెట్టారే గానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ కు వెలుగులు పంచిన శ్రీశైలం ప్రాజెక్టు భధ్రతను పట్టించుకోకుండా గాలికి వదిలేసారని తీవ్రంగా విమర్శించారు. ప్రాజెక్టు భధ్రత, నిర్వహణ, మరమ్మత్తులపై ఎప్పటికప్పుడు నీటిరంగ నిపుణులు నివేదికలు ఇస్తున్నప్పటికీ అందుకు కార్యాచరణ చేపట్టి నిధులు ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. పోలవరం ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అని గత ప్రభుత్వాలు, ఇప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం మీదనే దృష్టి కేంద్రీకరించారు.. పోలవరం డయాప్రం వాల్ దెబ్బతినిందని అఘమేఘాల మీద విదేశీ నిపుణులతో పర్యవేక్షించి అందుకు తగ్గట్లుగా వేలాది కోట్ల రూపాయల నిధులను పోలవరం ప్రాజెక్టు కోసం కేటాయీచారు.. ఇదే శ్రద్ద, చిత్తశుద్ది శ్రీశైలం ప్రాజెక్టుపై ఎందుకు చూపలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. శ్రీశైలం ప్రాజెక్టు భద్రతకోసం, పూడిక నివారణ కోసం ప్రాజెక్టు ఎగువన సిద్దేశ్వరం అలుగు నిర్మించాలని గత తొమ్మిదేళ్ళ నుంచి సమితి ఆద్వర్యంలో అనేక ఉద్యమాలు చేస్తున్నా పాలకులలో చీమకుట్టినట్లుగానైనా స్పందన కనపరచడం లేదని ఘాటుగా విమర్శించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి లు తక్షణమే శ్రీశైలం రిజర్వాయర్ భద్రత కోసం యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టి ప్రాజెక్టును కాపాడాలని బొజ్జా డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో ప్రజలే ఉద్యమం లోకి వచ్చి సిద్దేశ్వరం అలుగు నిర్మాణంతో పాటు మన సాగునీటి హక్కులను కాపాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 31 న సంగమేశ్వరంలో నిర్వహించే ప్రజా బహిరంగసభను విజయవంతం చేయడానికి ప్రజలందరూ సంఘటితంగా కదలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని బొల్లవరం, తమ్మడపల్లి, బుక్కాపురం, తిమ్మాపురం,అబ్బిపురం,పుట్టుపల్లి, అల్లినగరం, శ్రీ నగరం, మహానంది తదితర గ్రామాలలో ప్రజా బహిరంగసభకు సంబంధించి కరపత్రాలను, స్టిక్కర్ లను ఇంటింటికీ పంచారు.