కమలాపురం కరువు పై 23న ముఖ్యమంత్రి ఎదుట నిరసన
1 min readరైతులు తరలి రావాలి
నియోజకవర్గ రైతులకు సాయినాథ్ శర్మ పిలుపు
పల్లెవెలుగు వెబ్ కమలాపురం: కమలాపురం నియోజకవర్గం లో కరువు పరిస్థితులు విలయ తాండవం చేస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళే విధంగా నియోజక వర్గం లోని రైతాంగం అందరు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుట శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి శనివారం ఉదయం 10:30 గంటలకు కడప విమానాశ్రయం వద్దకు తరలిరావాలని తెలుగు నాడు ప్రజాసేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ రైతులకు పిలుపునిచ్చాడు. కమలాపురంలో శుక్రవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. నియోజక వర్గం లోని కమలాపురం వీరపునాయన పల్లి పెండ్లిమర్రి చింతకొమ్మదిన్నె చెన్నూరు వల్లూరు మండలాలలో కరువు పరిస్థితులు తీవ్ర రూపం దాల్చి పెట్టిన పెట్టుబడులు చేతికి రాగా అతివృష్టి అనావృష్టితో రైతాంగం అప్పులపాలై అష్ట కష్టాలు పడుతున్నప్పటికీ నియోజకవర్గంలోని ఆరు మండలాలను కరువు ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించకపోవడం తీరని అన్యాయమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో మూడు రోజుల పర్యటనకు శనివారం నాడు కమలాపురం నియోజకవర్గంలో ఉన్న విమానాశ్రయం నుంచి వెళుతున్న సందర్భంగా మన నియోజకవర్గంలోని రైతాంగమంతా విమానాశ్రయం వద్దకు తరలివచ్చి కరువు పరిస్థితులను ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లే విధంగా నిరసన కార్యక్రమం నిర్వహిద్ధామన్నారు. కమలాపురం నియోజకవర్గంలోని రైతాంగానికి పంటల సాగుకు జల వనరులుగా ఉన్న సర్వారాయ సాగర్ ,కేసీ కెనాల్ రైతాంగానికి ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయాయన్నారు. గత మూడు నాలుగు సంవత్సరాలుగా రైతాంగానికి పంటల బీమా రాకపోవడం అతివృష్టి అనావృష్టి కారణంగా రైతులు పెట్టిన పెట్టుబడులకు కనీస పంట కూడా చేతికందకపోవడంతో అనేక మంది రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. కమలాపురం ప్రాంతంలో పంటలు సాగుకు చేసిన అప్పులు తీర్చుకోలేక గత వారం ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. అలాగే రైతుల మీద ఆధారపడిన రైతు కూలీలు సైతం కూలి పనుల కోసం కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి పరిస్థితులు ఇలాగే కొనసాగితే కమలాపురం నియోజకవర్గంలో పాలమూరుగా తయారు కావడానికి ఇంకెన్ని రోజులో పట్టదన్నారు.రైతాంగ సమస్యలను తక్షణమే పరిష్కరించి కమలాపురం నియోజకవర్గం లోని ఆరు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి నియోజకవర్గం వ్యాప్తంగా రైతులకు పంట రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు ఇచ్చి ఎరువులు విత్తనాలు క్రిమిసంహారక మందులు ఉచితంగా పంపిణీ చేయాలని తాము రైతులందరి తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని రైతులు రైతు కూలీలు ఐక్యమత్యంగా కలిసికట్టుగా రాజకీయాలకతీతంగా ముఖ్యమంత్రి ఎదుట నిరసన కార్యక్రమానికి భారీ స్థాయిలో తరలిరావాలని సాయినాథ్ శర్మ పిలుపునిచ్చారు.