PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

(కమ్యూనిస్టు) పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్​ ఎదుట నిరసన..

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  సోషలిస్టు యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్టు) పార్టీ ఆధ్వర్యంలో గాజాపై జియోనిస్ట్ ఇజ్రాయెల్ అనాగరిక దిగ్బంధం విధించడాన్ని మరియు పాలస్తీనాపై దాని యుద్ధ నేరాలను ఖండిస్తూ ఈరోజు ఉదయం కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో SUCI(C) పార్టీ జిల్లా ఇంచార్జీ వి. హరీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ – ఇప్పటికే ముట్టడిలో ఉన్న అతి చిన్న భూభాగమైన గాజాపై, పశ్చిమాసియాలోని అమెరికా సామ్రాజ్యవాదానికి బ్రాంచ్ ఆఫీస్ గా ఉన్న జియోనిస్ట్ ఇజ్రాయెల్ ప్రభుత్వం, పూర్తి దిగ్బంధనాన్ని విధిస్తూ చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే దిగ్బంధంలో ఉన్న గాజాపై ప్రస్తుతం ఆహారం, నీరు, ఇంధనం మరియు విద్యుత్ సరఫరాపై  పూర్తి నిషేధం విధించిందని, స్వాతంత్ర్యం కోరుకునే 23 లక్షల పైచిలుకు పాలస్తీనా ప్రజలు అక్కడ నివసిస్తున్నారని తెలిపారు. పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ యొక్క జియోనిస్ట్ రక్షణ మంత్రి, మానవ జంతువులతో పోల్చడాన్ని ఖండించారు… అనాగరికమైన దిగ్బంధనంతో పాటు, ఇజ్రాయెల్ భీకరమైన వైమానిక దాడులు గాజాపై నిరంతరంగా చేయడం ద్వారా భూమిని శిథిలం చేసి నాశనం చేశారని అన్నారు.. ఈ ప్రక్రియలో వందలాది మంది అమాయక పౌరులను చనిపోయారని తెలిపారు. సామ్రాజ్యవాద వ్యతిరేక శాంతి-ప్రేమికులైన ప్రపంచ ప్రజలందరికీ తమ తారతమ్యాలు మరచి, యుద్ద పిపాసియైన జియోనిస్ట్ ఇజ్రాయెల్ ప్రభుత్వానికి మరియు వారి సామ్రాజ్యవాద గురువు మరియు మిత్రులకు వ్యతిరేకంగా ఐక్యంగా ముందుకు కదలాలని విజ్ఞప్తి చేశారు. వైమానిక బాంబు దాడులను వెంటనే ఆపాలని, దిగ్బంధనాన్ని ఉపసంహరించుకోవాలని మరియు పాలస్తీనా నుండి వెంటనే వైదొలగాలని ఇజ్రాయెల్ ను గట్టిగా డిమాండ్‌ చేశారు.కార్యక్రమంలో పార్టీ సీనియర్ సభ్యులు నాగన్న మాట్లాడుతూ – పాలస్తీనా ప్రజలపై పదేపదే సాయుధ మరియు మెరుపు దాడులతో కూడిన యుద్ధాలు, అమాయక పౌరులను నిర్దాక్షిణ్యంగా చంపడం అనేది 2007 నుండి నిరాటంకంగా కొనసాగుతోందని, పీడితులైన పాలస్తీనా ప్రజలు స్వాతంత్ర్యం కోసం చేస్తున్న చట్టబద్ధమైన పోరాటాన్ని ఇజ్రాయెల్ సంపూర్ణ శక్తితో అణచివేస్తోందని గుర్తు చేశారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి ఎం. తేజోవతి మాట్లాడుతూ – పాలస్తీనా ప్రజల స్వాతంత్ర్య పోరాటాన్ని బలపరచాలని, పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ పాలకుల యుద్ధ నేరాలను, గాజా ప్రజలకు నీరు, ఆహారం, ఇంధనం, విద్యుత్ అందకుండా ఫాసిస్టు ఇజ్రాయెల్ చేస్తున్న దిగ్బంధాన్ని ఖండించారు. ఈ కార్యక్రమంలో SUCI(C) పార్టీ నాయకులు ఎం. నాగన్న, తోజోవతి సభ్యులు రోజా, ప్రియాంక, బాబు, అఖిల్, మల్లేష్, శక్రప్ప తదితరులు పాల్గొన్నారు.

About Author