మిడుతూరులో జాయింట్ కలెక్టర్ కు నిరసన సెగ
1 min read-ప్రజల ఆమోదం లేకుండా సోలార్ ఎలా..? -మాకు సోలార్ వద్దే వద్దు..అని జాయింట్ కలెక్టర్ ను అడ్డగించిన రైతులు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: శుక్రవారం ఉదయం మిడుతూరు మండలానికి వచ్చిన నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మిడుతూరు తహసిల్దార్ కార్యాలయంలో అధికారుల సమావేశం అనంతరం పైపాలెం గ్రామంలో ఉన్న గట్టును పరిశీలించడానికి మధ్యాహ్నం ఒంటి గంటకు జాయింట్ కలెక్టర్ అక్కడికి వచ్చారు.జేసీ అక్కడికి వచ్చిన వెంటనే సిపిఎం పార్టీ నాయకులు నాగేశ్వరరావు,పక్కీర్ సాహెబ్ మరియు గ్రామ రైతులు జాయింట్ కలెక్టర్ ను అడ్డుకున్నారు.గ్రామ సర్పంచ్ మరియు పంచాయతీ తీర్మానం లేకుండా ప్రజల ఆమోదం లేకుండానే గట్టు పైన సోలార్ ప్రాజెక్టు ఎలా చేపడతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అంతేకాకుండా 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పంచాయతీ తీర్మానం మరియు 70 శాతం ప్రజల ఆమోదం తీసుకున్న తర్వాతనే గ్రామ పొలాల్లోకి రావాలని ప్రజల ఆమోదం లేకుండా మీరు ఎలా వస్తారని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డిని నాగేశ్వరరావు మరియు రైతులు ప్రశ్నించారు.పశువులు, జీవాలు వేల సంఖ్యలో ఉన్నాయని ఈ గట్టు పైనే పశువులను మేపుతూ ఉన్నామని ఇక్కడ ప్రతి ఒక్కరూ వ్యవసాయం పైనే ఆధారపడుతూ ఉన్నామని ఇక్కడ సోలార్ వేయడం వలన మాకు ఏమీ లాభం ఉండదని సోలార్ వేడి వల్ల పంటలు దిగుబడి తక్కువగా వస్తుందని అంతే కాకుండా పొలాలు అమ్మితే తక్కువ ధరకే అడుగుతారని రైతులు అన్నారు.చాలా పొలం ప్రైవేట్ భూమి బోర్లు ఉన్నాయని ప్రజల ఆమోదం లేకుండా పొలంలో జెండాలు ఎలా వేస్తారని రెవెన్యూ అధికారులకు తెలియకుండానే జెండాలు వేశారా అని వాళ్ళు ప్రశ్నించారు.సోలార్ వచ్చినా ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేది శూన్యమని ఉద్యోగాలు అన్నీ కూడా ఇతర రాష్ట్రాల వాళ్లకే ఇస్తారని ఇక్కడ అయితే సోలార్ వద్దని కలెక్టర్ తో గ్రామ సర్పంచ్ మర్రి రామచంద్రుడు, ఉప సర్పంచ్ మరి రామకృష్ణ, జగన్మోహన్ రెడ్డి,సొసైటీ చైర్మన్ తులసి రెడ్డి మరియు రైతులు ఖరా ఖండిగా తేల్చి చెప్పారు.జాయింట్ కలెక్టర్ పొలం యొక్క మ్యాప్ ను పరిశీలించారు.తర్వాత గ్రామంలో రైతులను సమావేశ పరచి ప్రజల సలహాలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆర్డిఓ కు సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్డిఓ ఎం.దాసు,తహసిల్దార్ ఎస్. ప్రకాష్ బాబు,మండల సర్వేయర్ కృష్ణుడు,ఆర్ఐ భాష,విఆర్వో ఖాదర్ బాష తదితరులు పాల్గొన్నారు.