ప్రజలకు మెరుగైన సేవలు అందించండి
1 min read– గ్రామ సచివాలయం సిబ్బందిని ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: ప్రభుత్వ ఆశయం సిద్ధించేలా అన్ని రకాల సేవలను సచివాలయాల్లోనే ప్రజలకు అందించాలని గ్రామ సచివాలయ సిబ్బందిని కర్నూలు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు ఆదేశించారు. బుధవారం కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామ సచివాలయం 1 ,2, పంచలింగాల రైతు భరోసా కేంద్రం 2 లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక, సంక్షేమ పథకాల క్యాలెండర్, ఎస్ఎల్ఏ గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక, ప్రభుత్వ పథకాల పోస్టర్ లు తదితర వాటిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సచివాలయంలో పరిధిలో 18 సంవత్సరాల పైబడిన వారికి ఎంత మందికి వ్యాక్సిన్ ఇచ్చారు వంటి వివరాలను ఏఎన్ఎంను అడిగి, రికార్డులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మీ పరిధిలోని 18 సంవత్సరాల నుంచి 45 లోపు ఉన్న వారు, గర్భవతులు అందరికీ చైతన్యం చేసి వ్యాక్సినేషన్ ప్రక్రియ వంద శాతం పూర్తి చేయాలని ఏఎన్ ఎంకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తూ సచివాలయ సేవలు గురించి గురించి ఇంటింటికి తెలియజేసి ప్రజల మన్ననలు పొందాలని సచివాలయ సిబ్బందికి జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
పారదర్శకంగా.. సేవలు అందించాలి
సమస్యలు తీర్చేలా సచివాలయాలు పని చేయాలని, ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలను ఇంటి వద్దనే అందించేందుకు సచివాలయ వ్యవస్థ అనేది చాలా కీలకమన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సచివాలయ సిబ్బందికి జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రజల దగ్గరగా ఉంటూ మెరుగైన సేవలు అందించడంతో పాటు సచివాలయానికి వచ్చే సర్వీసులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ సచివాలయ ఉద్యోగులకు సూచించారు. ప్రజలకు జాప్యం లేకుండా ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించాలని గ్రామ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. రైతు భరోసా కేంద్రంలో రైతులకు అందుబాటులో ఉన్న ఎరువులు తదితర వివరాలను నోటీస్ బోర్డ్ లో ప్రదర్శించాలని విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.