ప్రాజెక్టులపై సమగ్ర నివేదిక ఇవ్వండి
1 min read
నీటి విడుదల లో అక్రమాలకు పాల్పడకుండా పర్యవేక్షణ చేయాలి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లాలో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల వివరాలతో పాటు ప్రతిపాదించిన ప్రాజెక్టులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టుల పరిస్థితిపై జిల్లా కలెక్టర్ జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు..ఈ సందర్భంగా సుంకేసుల జలాశయం, గాజులదిన్నె ప్రాజెక్ట్, పందికోన రిజర్వాయర్, కృష్ణగిరి రిజర్వాయర్, హంద్రీనీవా విస్తరణ పనులు, పులికనుమ రిజర్వాయర్, 68 ట్యాంకులు నింపడం, గుండ్రేవుల రిజర్వాయర్ గురించి కలెక్టర్ జలవనరుల శాఖ అధికారులతో చర్చించారు.ఈ ప్రాజెక్టుల నీటి సామర్థ్యం, ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ, ఆయకట్టు వివరాలు, లబ్ది పొందుతున్న మండలాలు గురించి తెలుసుకున్నారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పందికోన రిజర్వాయర్ ద్వారా మరింత ఆయకట్టుకు నీరందించేందుకు వీలుగా రిజర్వాయర్ కు సంబంధించి మిగిలిపోయిన పనులను పూర్తి చేసేందుకు రూ.210 కోట్లతో రూపొందించిన ఎస్టిమేట్స్ ను త్వరితగతిన ప్రభుత్వానికి పంపించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. హంద్రీనీవా విస్తరణ పనులకు సంబంధించి జిల్లాలో జరుగుతున్న పనులను ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఈ ఏడాది జూన్ లోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.హంద్రీనీవా ద్వారా 68 ట్యాంకులను నింపడంలో భాగంగా జిల్లాలో ఉన్న 39 చెరువులకు గాను ఇప్పటివరకు 33 చెరువులకు నీరు నింపడం జరిగిందని, మిగిలిన ట్యాంకులను కూడా త్వరితగతిన నింపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 33 చెరువులు ఫుల్ గా నింపారా అని కలెక్టర్ అధికారులను ఆరా తీశారు. 23 ట్యాంకులను ఫుల్ గా నింపామని, 10 ట్యాంకులను కు పాక్షికంగా నీరు నింపడం జరిగిందని అధికారులు తెలుపగా, పూర్తి వివరాలను తనకు అందచేయాలని కలెక్టర్ ఆదేశించారు..జిల్లాలో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న సమస్యలు, అవసరమైన నిధులు, అలాగే గుండ్రేవుల, ఆర్డీఎస్, వేదవతి ప్రాజెక్టుల వివరాలను సమగ్రంగా జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో అందచేయాలని కలెక్టర్ జలవనరుల శాఖ ఎస్ఈని ఆదేశించారు..కలెక్టర్ ల కాన్ఫరెన్స్ లో ఈ అంశంపై ప్రజంటేషన్ ఇస్తామని కలెక్టర్ పేర్కొన్నారు..తుంగభద్ర దిగువ కాలువ చివరి ఆయకట్టు రైతులకు డబ్బులిస్తేనే నీళ్ళు ఇస్తాం అని పత్రికల్లో వచ్చిన వార్తలపై కలెక్టర్ అధికారులను వివరణ అడిగారు..డబ్బు వసూళ్ల వంటి అక్రమాలు జరగకుండా ఇంజనీర్లు తగిన పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, జలవనరుల శాఖ ఎస్ ఈ ద్వారకనాథ్ రెడ్డి, హంద్రీనీవా ఈఈ చంద్రశేఖర్ రెడ్డి, ఈ ఈ లు, డిఈ లు శైలేష్, రామకృష్ణ , విజయ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
