పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించండి
1 min read– కేతంరెడ్డి గారిపల్లె అంగన్ వాడీ కేంద్రంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: అంగన్ వాడీ కేంద్రంలో పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని అంగన్ వాడి టీచర్ ను కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం సంబేపల్లి మండలం, మోటకట్ల గ్రామం, కేతంరెడ్డి గారిపల్లి అంగన్ వాడీ కేంద్రంను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు… ఈ రోజు ఎంతమంది హాజరయ్యారు వంటి వివరాలను కలెక్టర్ అంగన్ వాడీ టీచర్ ను అడిగి తెలుసుకున్నారు. అందులో భాగంగా పిల్లలతో మీ వయసెంత, ఏ తరగతని ఆప్యాయంగా పిల్లలను పలకరిస్తూ ముచ్చటించారు. ఆంగ్లం, తెలుగులో వర్ణమాలలు పిల్లలని కలెక్టర్ అడిగి తెలుసుకుని బాగా చెప్పడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అంగన్ వాడీ కేంద్రంలో వండిన భోజనాన్ని తనిఖీ చేసి నాణ్యతను పరిశీలించారు. పిల్లలకు మంచి పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు. పిల్లల హాజరు రికార్డులను పరిశీలించి హాజరులో వ్యత్యాసం ఉండడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్ వాడీ కేంద్రంలో ఉన్న పిల్లల ఆధార్ మ్యాపింగ్ అయిందా లేదా అడిగి తెలుసుకున్నారు. అంగన్ వాడీ కేంద్రంలో బలహీనమైన పిల్లలు ఉంటే అదనంగా పౌష్టికాహారం అందించాలని తెలిపారు. ఈ తనిఖీలో ఐసిడిఎస్ పిడి ధనలక్ష్మి, డీఎంహెచ్ ఓ డాక్టర్ కొండయ్య, తహసీల్దార్ మహేశ్వరి బాయి, సిడిపిఓ, తదితరులు పాల్గొన్నారు.