పోలీస్ స్టేషన్ ఎదుటే రెచ్చిపోతున్నారు
1 min readపల్లెవెలుగు వెబ్, అనంతపురం: పోలీస్ స్టేషన్ ఎదుటే వైకాపా కార్యకర్తలు రెచ్చిపోతుంటే.. గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలకు రక్షణ ఎక్కుడుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్. ఇరువర్గల మధ్య ఘర్షణ జరిగినపుడు.. కేవలం ఒక వర్గం వారిచ్చిన కేసునే ఎందుకు నమోదు చేస్తున్నారంటూ పోలీసులను ప్రశ్నించారు. వైకాపా వారి మీద కేసు నమోదు చేయకపోవడం దారుణమన్నారు. ఇటీవల చెన్నెకొత్తపల్లి మండలం ముష్టికొవెల లో టీడీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు ఆయన వెళ్లారు. ఆ సమయంలో ముష్టికొవెల గ్రామంలో టీడీపీ, వైకాపా కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. ఈ కేసులో పరిటాల శ్రీరామ్ తో పాటు తొమ్మది మంది మీద కేసు నమోదు చేశారు. అయితే.. టీడీపీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు తీసుకోకుండా.. వైకాపా కార్యకర్తల మీద కేసు నమోదు చేయకుండా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడాన్ని ప్రశ్నించడానికి చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఎదుట కూడ టీడీపీ కార్యకర్తలను వైకాపా కార్యకర్తలు విమర్శించడంతో.. స్వల్ప ఘర్షణకు దారితీసింది. ఈ నేపథ్యంలో పరిటాల శ్రీరామ్ పోలీసుల తీరును దుయ్యబట్టారు. ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. కేసు నమోదు చేస్తే ఇరుపార్టీల కార్యకర్తల మీద చేయాలని.. కేవలం ఒకరి మీదే కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు.