PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారు..

1 min read

– కళ్ళుండి చూడలేని ప్రజా ప్రతినిధులు, పాలకులు..

– టిడిపి, జనసేన ఏలూరు నియోజకవర్గ కన్వీనర్లు

– బడేటి చంటి, రెడ్డి అప్పలనాయుడు ఆరోపణలు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన  సైకో సీఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో పతనం తప్పదని  టిడిపి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి బడేటి చంటి, జనసేన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టిడిపి- జనసేన ఉమ్మడి కార్యాచరణలో భాగంగా శనివారం ఏలూరు వన్ టౌన్ లోని  బిర్లా భవన్  సెంటర్ సమీపంలో  శ్రీకృష్ణదేవరాయ  స్పెషల్ మున్సిపల్ హై స్కూల్ వద్ద  అధ్వానంగా మారిన  రహదారిపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెద్దపెట్టున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బడేటి చంటి,  రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, నగర మేయర్ నూర్జహాన్, ఇతర ప్రజా ప్రతినిధుల పై తీవ్రస్థాయిలో  విరుచుకుపడ్డారు. ఏలూరు కార్పొరేషన్ కు కోట్ల రూపాయల మేర ఆదాయం వస్తున్నా నగర ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో పాలకులు పూర్తిస్థాయిలో  విఫలమయ్యారని ఆరోపించారు. నగరంలో పలు ప్రాంతాలు చిన్నపాటి వర్షానికి మడుగుల్లా మారుతున్నా, అనేక రోడ్లు శిథిలమైనా  కళ్ళు ఉండి కూడా చూడలేని పరిస్థితిలో ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని  ఉన్నారని విమర్శించారు. శ్రీకృష్ణదేవరాయ స్కూల్ వద్ద  రోడ్డు నిర్మాణానికి 2020 లో  ఎమ్మెల్యే శంకుస్థాపన చేసినప్పటికీ నేటి వరకు నిర్మించకపోవడం ఆయన చేతకానితనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. చిన్న చిన్న పనులు చేస్తూ   అభివృద్ధి చేస్తున్నామని బిల్డప్ ఇవ్వడం తప్ప ఎమ్మెల్యే చేసింది ఏమీ లేదని  విమర్శించారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దిగమింగుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికలవేళ ఓట్లు దండుకోవడానికి  వల్లమాలిన ప్రేమ ఒలకపోస్తున్నారని, అయితే ఆయన మాయమాటలను నమ్మే పరిస్థితిలో ఏలూరు నగరవాసులు లేరన్న  వాస్తవాన్ని గుర్తుంచుకోవాలన్నారు.  వైసీపీ నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని, వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయమని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ పరిశీలకులు కాశీ నవీన్ కుమార్  మరియు మాజీ ఏఎంసి చైర్మన్ నిరంజన్ , చాలా బాలాజీ, తెలుగుదేశం పార్టీ,జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author