PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌నులన్నీ ప‌క్కన ప‌డేయండి… పిల్లల‌తో కాసేపు గ‌డ‌పండి !

1 min read

పల్లెవెలుగు వెబ్​ : చాలా కుటుంబాల్లో భార్యభ‌ర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. వారి ప‌ని ఒత్తిడి కార‌ణంగా పిల్లల‌ను డే కేర్‌ సెంటర్‌లో వదులుతున్నారు. కానీ గత సంవత్సరంన్నర కాలంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కావడం, డే కేర్‌ సెంటర్‌లూ అందుబాటులో లేకపోవడంతో తమ పిల్లల‌ను ఇంటిలోనే ఉంచుకుంటున్నారు. కానీ ఎవరి పనుల్లో వారు బిజీగా గడిపేస్తున్నారు. పిల్లల‌కు నాలుగో సంవత్సరం వస్తుంది కానీ మాట సరిగా రావడం లేదు కదా ఎదుగుదల కూడా సరిగా లేనట్లుగా చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. అన్ని పరీక్షలూ చేసిన డాక్టర్లు శారీరకంగా అంతా సరిగానే ఉందంటూ సైకియాట్రిస్ట్ కు రిఫర్‌చేస్తున్నారు. సైకియాట్రిస్ట్ లు త‌ల్లిదండ్రుల‌ను సుతిమెత్తగా మందలించడమే కాదు, పిల్లలతో తల్లిదండ్రులు సరిగా గడపకపోవడం వల్ల వచ్చే సమస్య అదని, తాత్కాలిక సమస్యగానే దీనిని పరిగణించాల్సి ఉంటుందనీ చెబుతున్నారు.
ఆటిజం ల‌క్షణాలా ?
ఈ ఒక్క కేసు మాత్రమే కాదు, ఇటీవలి కాలంలో తమ పిల్లలు సరిగా మాట్లాడలేకపోతున్నారని, కార్టూన్‌ క్యారెక్టర్లలలా తమ పిల్లలు మాట్లాడుతున్నారు, తమ పిల్లలు పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకోవడం లేదు… ఆటిజం లక్షణాలు ఏమైనా ఉన్నాయా…. అంటూ సైక్రియాటిస్ట్‌ల వెంట పడుతున్న తల్లిదండ్రుల సంఖ్య పెరుగుతుంది. దాదాపుగా సంవత్సర కాలంగా నాలుగు గోడల నడుమ, తమ తోటి వారికి దూరంగా, డిజిటల్‌ స్ర్కీన్‌లకు దగ్గరగా పిల్లలు గడుపుతుండటమే సమస్యకు కారణమని వెల్లడిస్తున్నారు సైక్రియాట్రిస్ట్‌లు. అదే సమయంలో ఆటిజం కాదంటూనే తల్లిదండ్రులు కాస్త జాగ్రత్త తీసుకుంటే, కొన్నాళ్లకు ఈ సమస్య నుంచి బయట పడటమూ జరుగుతందనే భరోసానూ అందిస్తున్నారు.
ఇళ్లకే పరిమితం… స‌మ‌స్యకు కార‌ణం
చాలామంది పిల్లలు దాదాపుగా సంవత్సరంన్నరగా ఇళ్లకే పరిమితమయ్యారు. మరికొద్ది కాలం ఇళ్లలోనే గడిపే అవకాశమూ ఉంది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పేరిట తల్లిదండ్రులు బిజీ. కరోనా కాలంలో ప్రయాణాలా అంటూ తాత-అమ్మమ్మ/నాన్నమ్మలూ ఎవరింట్లో వారుండటంతో పిల్లలు డిజిటల్‌ స్ర్కీన్‌లకు అంకితమైపోతున్నారు. దాదాపుగా సంవత్సరం పాటు ఇళ్లకే పరిమితం కావడమన్నది చిన్నారుల ఎదుగుదలపై అతి తీవ్ర ప్రభావం చూపే అంశమే. తన తోటి పిల్లలతో కూడా గడిపే అవకాశం లేకపోవడం చేత వారు సరిగా మాట్లాడలేకపోవడం జరుగుతుంది అని సైక్రియాటిస్ట్‌లు వెల్లడిస్తున్నారు.
త‌ల్లిదండ్రులు ఏం చేయాలి :
తల్లిదండ్రులు ఏం చేయాలంటే, చిన్నారులతో క్వాలిటీ టైమ్‌ గడపాలి. వారు చెప్పింది వినాలి, వారితో మాట్లాడాలి. వారి మీద ఒత్తిడి తీసుకురావడం సూచనీయం కాదు. అలాగే, సహేతుకమైన హద్దులు ఏర్పరచాలి. మీరు వారిని అమితంగా ప్రేమిస్తున్నారని చెప్పడమే కాదు, మీ సమయం వారి కోసం వెచ్చిస్తున్నారనీ తెలపాలి. అంతేకాదు, పరిమితికి మించి ఏదైనా వాడితే కలిగే అనర్థాలు అనుభవపూర్వకంగా వారు తెలుసుకునేలా చేయాలి. మీ పిల్లలతో స్నేహితుల్లా మెలగడంతో పాటుగా వారు ఏం చెప్పినా ఓపిగ్గా వినాలి. పేరెంటల్‌ కంట్రోల్‌ సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ చేయడంతోపాటుగా మీ పిల్లలకు అతి తక్కువగా ఇంటర్నెట్‌ వినియోగం అందుబాటులో ఉంచాలి. అదే సమయంలో కుటుంబ బంధాలను పున రావిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. వారి స్నేహితులను కలుసుకునే అవకాశం అందిస్తూనే ఇండోర్‌ ఫిజికల్‌ యాక్టివిటీస్‌ ప్రోత్సహించాలి. చిన్నారుల ఆందోళనను పొగొడుతూనే వారి అనుమానాల‌నూ నివృత్తి చేయాలి.

About Author