PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రశ్నార్థకంగా మారిన ప్రజాస్వామ్యం : అంబటి

1 min read

– విజయవాడ ప్రెస్ క్లబ్‌లో సేవ్ జర్నలిజండే సదస్సు
పల్లెవెలుగు వెబ్ విజయవాడ : ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో “సేవ్ జర్నలిజండే” కార్యక్రమం జరిగింది. ఏపీయూడ బ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛ లేనప్పుడు ప్రజా స్వామ్యమనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. గతంలోని యాజమాన్యాలు పత్రిక ఎడిటర్ కు పూర్తి స్వేచ్ఛ ఉండేదన్నారు. అందువల్ల ప్రజా సమస్యలపై జర్నలిస్టులు స్పందించడం తోపాటు సమాజానికి అవసరమైన వార్తలు వెలుగు చూసేవని, ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే వారన్నారు. అలాగే జర్నలిస్టులపై అడ్వర్టైజింగ్ యాడ్స్ బాధ్యతను బలంగా మోపడంతో జర్నలిస్టులు ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వం చేసే అరాచకాలను ప్రస్పుటంగా రాయలేక పోతున్నారన్నారు. ఎవరైనా ప్రభుత్వం చేసే ప్రజావ్యతిరేక విధానాలను రాస్తే వారిపై కేసులు పెట్టి కలం గళాన్ని అణిచివేస్తున్నారని అన్నారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ అదే పరిస్థితి కొనసాగడం శోచనీయమన్నారు. రాష్ట్ర ప్రధానకార్యదర్శి చందు జనార్ధన్ మాట్లాడుతూ జర్నలిస్టులపై దేశ వ్యాప్తంగా జరుగుతున్న దాడులను అరికట్టాల్సిన అవసరం ఆసన్నమైంద న్నారు. కార్పొరేట్ సంస్థల బారినుండి మీడియాలోని జర్నలిస్టులను కాపాడుకోవడం ద్వారా వారికి అవసరమైన చట్టాలను పటిష్టంగా అమలు చేసే విధంగా యూనియన్ ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రభుత్వాలు చేసే అవినీతి, అక్రమాలను ఎత్తిచూపితే జర్నలిస్టుల పై దేశద్రోహం లాంటి చట్టాలను ప్రయోగించడం ఆపేయాలని ఆయన డిమాండ్ చేశారు. మీడియాపై జరిగే అకృత్యాలను పాలకుల దృష్టికి తీసుకెళ్లడానికి దేశవ్యాప్తంగా ‘సేవ్ జర్నలిజం’ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా పాలక శక్తుల ఇష్టాయిష్టాలకు లొంగని స్వతంత్ర జర్నలిస్టులు, మీడియా సంస్థల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసహన వైఖరి చూపించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అన్నారు. ప్రస్తుతం దేశం, రాష్ర్టంలో బడా కార్పొరేట్ సంస్థల కబంధ హస్తాలలో మీడియా చిక్కుకుపోయిందన్నారు. రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు మాట్లాడుతూ ఇపుడు పత్రిక సంపాదకులు మరియు జర్నలిస్టుల స్వతంత్రతను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టులపై ఉపయోగించే దేశద్రోహం వంటి క్రూరమైన చట్టాలను ప్రయోగించడం ఆపాలన్నారు. అలాగే ఐటీ నిబంధనల ముసుగులో డిజిటల్ మీడియాకు సమస్యలు సృష్టించడం అపాలన్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరియు సెంట్రల్ మీడియా అక్రిడిటేషన్ కమిటీలోని అన్ని గుర్తింపు పొందిన జర్నలిస్టు యూనియన్‌లకు ప్రాతినిధ్యాన్ని పునరుద్ధరించాలని కోరారు. జర్నలిస్టులు మరియు మీడియా సంస్థలపై దాడులు పెరిగిపోతున్నాయని, దాడుల నియంత్రణకు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. రైల్వేలో జర్నలిస్టులకు అన్ని రాయితీలను పునరుద్ధరించాలన్నారు. అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌ను ఇవ్వాలని, ఆంధ్రప్రదేశ్‌లో గతంలోని ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన అన్ని ఇతర సౌకర్యాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ప్రధానకార్యదర్శి చందు జనార్ధన్ మాట్లాడుతూ దేశం లో మీడియా సంస్థలను కార్పొరేట్ సంస్థ లు తమ ఆధీనంలో కి తెచ్చు కున్నయని విమర్శించారు.అధికార పార్టీ లకోసం పటిష్ట మైన మీడియా సంస్థలను కొనుగోలు చేసి ప్రశ్నించే గొంతులను నొక్కేస్తూ ప్రభుత్వ వ్యతిరేకత ను కనిపించకుండా చేస్తున్నారని ఆరోపించారు.అందుకే అమరజీవి భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా సేవ్ జర్నలిజం పేరిట ఇ జే యు దేశ వ్యాప్త కార్యక్రమానికి పిలుపునిచ్చార నీ అన్నారు.యూనియన్ లో 50 సంవత్సరాలు సుదీర్ఘ నాయకత్వం కల అంబటి ఆంజనేయులు ఐజేయూ స్టీరింగ్ కమిటీ లో స్థానం కల్పించడం పట్ల రాష్ట్ర కమిటీ పక్షాన చందు జనార్ధన్ ఐజేయూ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం జర్నలిస్టులు విజయవాడ ప్రెస్ క్లబ్ ఎదుట నిరసన ప్రదర్శనలో నినాదాలు చేశారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావును క్యాంప్ కార్యాలయంలో కలిసి సేవ్ జర్నలిజం సేవ్ డెమొక్రసీ అనే నినాదంతో పాటు జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేయాలని నేతలు ఆయనకు విజ్ఞప్తి చేయగా తాను తప్పకుండా ప్రభుత్వానికి తెలియజేస్తానని హామీ ఇచ్చారు. ‌ ఈ కార్యక్రమంలో విజయవాడ అర్బన్ యూనిట్ అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చావా రవి, వెంకట్రావు, అర్బన్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, ఐజేయూ కౌన్సిల్ సభ్యులు ఎస్కే బాబు, ఎన్ సాంబశివరావు, ప్రెస్ క్లబ్ కార్యదర్శి ఆర్ వసంత్ పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమం అనంతరం ఐజేయూ స్టీరింగ్ సభ్యులుగా నూతనంగా ఎంపికైన అంబటి ఆంజనేయులును ఎన్టీఆర్ జిల్లా యూనియన్ నేతలు ఘనంగా సత్కారించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు జి రామారావు, దాసరి నాగరాజు, కోశాధికారి బీవీ శ్రీనివాసరావు,జిల్లా యూనియన్‌ నేతలు పాల్గొన్నారు.

About Author