సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కలిగేలా క్యూ లైన్లు నిర్వహించాలి…
1 min read
సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చక్కని దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేయాలి
తొక్కిసలాట జరగకుండా క్యూ లైన్ల నిర్వహణ జరగాలి
ఫెర్రీ వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటలు జరగకుండా ఏర్పాట్లు చేయాలి
త్రాగునీరు, పారిశుధ్యంనకు ప్రాధాన్యత ఇవ్వాలి
పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సమీక్ష
పల్లెవెలుగు,ఏలూరుజిల్లా ప్రతినిధి: పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాలలో సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చక్కని దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఈనెల 26న పట్టిసీమలో జరుగు శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి , జిల్లా జాయింట్ కలెక్టర్ పి. దాత్రి రెడ్డి తో కలిసి సోమవారం పట్టిసం రివర్ ఇన్ లో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పట్టిసీమలో ఈనెల 25 నుండి 27వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా నిర్వహించేందుకు శాఖల సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని, క్యూ లైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా త్వరితగతిన దర్శనం కలిగేలా క్యూ లైన్లు నిర్వహించాలన్నారు. భక్తుల మనోభావాలకు తగిన రీతిలో ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ముఖ్యంగా క్యూ లైన్లలో తొక్కిసలాట జరగకుండా క్యూ లైన్ల నిర్వహణకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయం వద్ద, ప్రధాన రహదారుల్లో రాకపోకలకు అంతరాయం కలుగకుండా, తొక్కిసలాట జరుగకుండా ట్రాఫిక్ నియంత్రణ, బారికేడ్ల ఏర్పాటు చేపట్టాలన్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాల్లో పారిశుధ్య పనులను ప్రాధాన్యతతో నిర్వహించాలని, భక్తుల రద్దీకి తగ్గట్టుగా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. అలాగే త్రాగునీరు, ప్రథమ చికిత్స శిబిరాలు, ముఖ్యంగా గోదావరి వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన రక్షణ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. భక్తులు స్నానం ఆచరించే , గోదావరి వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. భక్తుల కొరకు తాత్కాలిక మరుగుదొడ్లు, స్త్రీలు బట్టలు మార్చుకునే గదులు, చలవ పందిళ్లు, రాత్రి పూట ఆలయ ప్రాంగణాల్లో విద్యుత్ దీపాలు, భక్తులకు వివిధ సమాచారం అందించేందుకు సమాచార కేంద్రాలు, సిసి కెమెరాలతో పర్యవేక్షణ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఈ ఉత్సవాలకు వివిధ జిల్లాల నుండి పెద్దఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా, భక్తుల సంఖ్యకు అనుగుణంగా వివిధ డిపోల ద్వారా ఆర్టీసీబస్సులు నడపాలన్నారు. త్రాగునీరుకు హ్యాండ్ పంపులు, విద్యుత్తుకు ఎటువంటి అంతరాయం కలగకుండా జనరేటర్లు ఏర్పాటు చేయాలనీ, , ఈ ఉత్సవాల సమయంలో మద్యం అమ్మకాలు జరగకుండా షాపులు తప్పనిసరిగా మూసివేయాలన్నారు. వాహనాల పార్కింగ్ కు ప్రత్యేక ప్రదేశాలు ఏర్పాటు చేయాలన్నారు. నదీ స్నానం ఘాట్లు, పిండ ప్రధానం ఘాట్లు, మహిళల స్నానాల ఘాట్లకు మార్గాలు తెలియజేసే బోర్డులు ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులను నదిని దాటించే సమయంలో ఫెర్రీ వద్ద ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర సమయంలో సహాయం అందించేందుకుగాను గోదావరి నది వెంబడి 108 వాహనాలు, వైద్య కేంద్రాలు,మోటారు బోట్లు, గత ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. మూడు రోజులలో గోదావరి నదిలో భక్తులను తరలించేందుకు భక్తుల సంఖ్య ను దృష్టిలో ఉంచుకుని పంట్లు, లాంచీలను ఏర్పాటు చేయాలనీ, వాటి సామర్ధ్యానికి మించి ప్రజలను ఎక్కించకుండా అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా త్రాగునీటి ఎక్కడా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుముందు పట్టిసీమ ఆలయంలో క్యూ లైన్లు, తదితర ఏర్పాట్లను కలెక్టర్, జేసీ పరిశీలించారు.జంగారెడ్డిగూడెం ఆర్డీఓ వెంకటరమణ, డిపిఓ అనురాధ, డీ ఎస్పీ వెంకటేశ్వరరావు, ఆలయధర్మకర్త మండలి చైర్మన్ కుంచనచర్ల జగన్నాధరావు, ఆలయ కమిటీ సభ్యులు వీరభద్రరావు, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమీషనర్ రంగారావు, ఆలయ ఈఓ చాగంటి సురేష్, సర్పంచ్ శ్రీరామమూర్తి, తహసీల్దార్ , ఎంపిడిఓ, వివిధ శాఖల అధికారులు, ప్రభృతులు పాల్గొన్నారు.