బ్యాంకు అకౌంట్లో ఒక్కసారిగా కోట్లు పడ్డాయి !
1 min readపల్లెవెలుగువెబ్ : హెచ్డీఎఫ్సీ బ్యాంకులో కలకలం రేగింది. వందమంది ఖాతాదారులు ఒక్కసారిగా కోటీశ్వరులు అయిపోయారు. తమ ఖాతాలో కోట్లాది రూపాయలు క్రెడిట్ కావడం చూసి షాకయ్యారు. వికారాబాద్ జిల్లాలో వెంకటరెడ్డి అనే వ్యక్తి ఖాతాలో ఒక్కసారిగా రూ. 18 కోట్ల 52 లక్షలు క్రెడిట్ అయ్యాయి. తన ఖాతాలో అంత పెద్ద మొత్తంలో డబ్బులు పడేసరికి ఆయన ఖంగుతిన్నారు. బ్యాంక్ అధికారులకు సమాచారం ఇచ్చారు. చెన్నై టీ.నగర్ హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు చెందిన వందమంది ఖాతాదారులకు ఒక్కసారిగా కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయి. కొందరు నగదును వెనక్కి తీసుకున్నారు. కొంతమంది ఈ విషయాన్ని బ్యాంక్ అధికారులకు తెలియజేశారు. వెంటనే ఆ వంద ఖాతాలను సీజ్ చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొందరు డబ్బు డ్రా చేసినట్లు అధికారులు గుర్తించారు. టీ.నగర్ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఇటీవల సాఫ్ట్ వేర్లో కొత్త మార్పులు చేస్తున్నారు. సాంకేతిక లోపంతోనే ఇలా జరిగిందని బ్యాంక్ మేనేజ్మెంట్ కస్టమర్లకు మెసేజ్ పంపింది. నగదు బదిలీ, సాంకేతిక కారణాలతో జరిగిందా? లేక ఎవరైనా సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.