స్వప్రయోజనాల కోసమే రమణ దీక్షితులు ట్వీట్స్ !
1 min read
పల్లెవెలుగువెబ్: సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటన నిరాశపరచిందన్న తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన ట్వీట్‌పై తిరుమల అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీలో బ్రాహ్మణ వ్యతిరేక శక్తులు ఉన్నాయని ఆరోపిస్తూ ఆయన చేసిన ట్వీట్‌పై అర్చకులు మండిపడ్డారు. ఈ మేరకు రమణ దీక్షితులు పోస్ట్ చేసిన ట్వీట్‌పై తిరుమలలోనే అర్చకులు ఏకంగా మీడియా సమావేశాన్నే ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రమణ దీక్షితులుపై అర్చకులు ఘాటు విమర్శలు చేశారు. రమణ దీక్షితులు స్వప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారంటూ వారు ఆరోపించారు. రమణ దీక్షితులు చెబుతున్న ఏకసభ్య కమిటీ సిఫారసు చేసిన అంశాలేమిటో ఎవరికీ తెలియవన్నారు. బయటి విషయాలను తామేమీ పట్టించుకోవడం లేదని, స్వామి వారి కైంకర్యాలను వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో తమకు ఎలాంటి అవరోధాలు ఎదురు కావడం లేదని కూడా వారు వెల్లడించారు.