PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రపంచ లూప‌స్ డే సంద‌ర్భంగా కిమ్స్ ఆస్పత్రిలో ర్యాంప్ వాక్

1 min read

పల్లెవెలుగు వెబ్ హైద‌రాబాద్ : కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (కిమ్స్)లోని క్లినిక‌ల్ ఇమ్యునాల‌జీ మరియు రుమ‌టాల‌జీ విభాగం ఆధ్వ‌ర్యంలో ప్రపంచ లూప‌స్ డే సంద‌ర్భంగా బుధవారం సాయంత్రం 3 గంట‌ల నుంచి 6 గంట‌ల వ‌ర‌కు ర్యాంప్ వాక్ మ‌రియు లూప‌స్ అవ‌గాహ‌న కార్యక్రమం నిర్వహించారు. ఇండియన్ రుమటాలజీ అసోసియేషన్, హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు డా. రాజ్ కిరణ్, డైరెక్టర్, అకాడమిక్స్, కిమ్స్ హాస్పిటల్స్ ప్రో. మణిమాలరావు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆసియాలోనే ఇలా ర్యాంప్ వాక్ నిర్వహించ‌డం ఇది మూడోసారి. సుమారు 50 మంది లూప‌స్ పేషెంట్లు ఈ ర్యాంప్ వాక్‌లో పాల్గొన్నారు. స‌మాజంలోని వివిధ‌ వ‌ర్గాల‌కు చెందిన 250 మంది వ‌ర‌కు ఇందులో పాల్గొన్నారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్లినిక‌ల్ ఇమ్యునాల‌జీ మరియు రుమ‌టాల‌జీ విభాగం క్లినిక‌ల్ డైరెక్టర్ డాక్టర్ వీర‌వ‌ల్లి శ‌ర‌త్ చంద్రమౌళి ఆలోచ‌న‌ల ఫ‌లితంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా డాక్టర్ శ‌ర‌త్ చంద్ర మౌళి మాట్లాడుతూ, ప్రతి వెయ్యిమందిలో ఒక‌రికి లూప‌స్ ఉంటోంద‌ని, ఈ స‌మ‌స్య ఉండే ప్రతి 10 మందిలో 9 మంది మ‌హిళ‌లేన‌ని చెప్పారు. చాలావ‌ర‌కు 15 నుంచి 45 ఏళ్ల మధ్య వ‌య‌సులోనే (పున‌రుత్పాద‌క ద‌శ‌) ఈ స‌మ‌స్య వ‌స్తోందని, కానీ పిల్లల్లో కూడా రావ‌చ్చని ఆయ‌న తెలిపారు. అయితే ఈ స‌మ‌స్య గురించి ఇటు సామాన్య ప్రజ‌ల‌తో పాటు వైద్యుల్లోనూ అవ‌గాహ‌న అంత‌గా లేక‌పోవ‌డంతో.. వ్యాధి వ‌చ్చిన త‌ర్వాత‌ రుమ‌టాల‌జిస్టు వ‌ద్దకు వెళ్లడానికి దాదాపు మూడేళ్లకు పైగా ప‌డుతోంద‌ని ఆయ‌న వివరించారు. “ప్రపంచ‌వ్యాప్తంగా ఉన్న ఈ స‌మ‌స్య అన్ని జాతుల‌వారు, అన్ని దేశాల వారు, అన్ని మ‌తాలు, వ‌య‌సులు, లింగ‌భేదం లేకుండా వ‌స్తోంది. లూప‌స్ శ‌రీరంలో ఏ భాగాన్నైనాప్రభావితం చేయొచ్చు. చాలాసార్లు అస‌లు దాని గురించి తెలియ‌దు కూడా. ఇది ఒక దీర్ఘకాలిక ఆటో-ఇమ్యూన్ వ్యాధి. ఇందులో మ‌న రోగ‌నిరోధ‌క శ‌క్తి అతిగా క్రియాశీల‌కం అయిపోయి, సాధార‌ణ క‌ణ‌జాలాల‌పై దాడిచేస్తుంది. కొంద‌రికి చర్మం మీద ద‌ద్దుర్లు రావ‌డం, జుట్టు ఊడిపోవ‌డం, నోట్లో పుండ్లు ప‌డ‌టం, కీళ్ల వాపులు, నొప్పి, తీవ్రంగా త‌ల తిర‌గ‌డం, జ్వ‌రం లాంటివి రావ‌చ్చు. ఇది ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె, చ‌ర్మం, ర‌క్తం.. ఇలా దేన్న‌యినా ప్రభావితం చేసే అవ‌కాశం ఉంటుంది. లూప‌స్ గురించి అనేక అపోహ‌లున్నాయి. అయితే, ఆధునిక వైద్య‌విధానాల్లో లూప‌స్ రోగుల‌కు అత్యుత్తమ చికిత్స అందుబాటులో ఉంటోంది. త‌గిన అవ‌గాహ‌న క‌ల్పించ‌గ‌లిగితే చాలామంది రోగులు త్వ‌ర‌గా ఈ స‌మ‌స్యను గుర్తించి, త‌గిన చికిత్స పొంది, ఆరోగ్య‌క‌రంగా జీవించ‌గ‌ల‌రు” అని డాక్టర్ శ‌ర‌త్ చంద్ర మౌళి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ మరియు ఐఆర్ఏ (ఇండియ‌న్ రుమ‌టాల‌జీ అసోసియేష‌న్‌), ఐఆర్ఏ హైద‌రాబాద్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ర్యాంప్ వాక్ లో విజేతలుగా నిలిచిన వారికి ముఖ్యఅతిధులు బహుతులతో సత్కరించారు.

About Author