ప్రాథమిక ఉన్నత పాఠశాలల ఆకస్మిక తనిఖీ
1 min readవిద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాలి
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: పాణ్యం మండలం మద్దూరు గ్రామంలోని మండల పరషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసారు.ప్రాథమిక ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం తక్కువగా ఉందని గ్రామంలో ఇంటింటికి తిరిగి బడిఈడు పిల్లలను గుర్తించి నమోదు చేయించాలని కలెక్టర్ ప్రధానోపాధ్యాయులు, టీచర్లను ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వ మెనూ ప్రకారం అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలిస్తూ కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల మైదానం, తరగతి గదులు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మనబడి మన భవిష్యత్తు కింద చేపట్టిన పాఠశాల భవన నిర్మాణాల పనులను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలలకు హాజరైన విద్యార్థుల సంఖ్య, పాఠ్య పుస్తకాలు, మరుగుదొడ్ల నిర్వహణ, త్రాగునీటి వసతి తదితర మౌలిక సదుపాయాలపై కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాలని ఉపాధ్యాయులను కలెక్టర్ ఆదేశించారు.