ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ రోడ్ల పనులు 100 శాతం పూర్తి
1 min read
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు : ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ శాఖల ద్వారా ప్రారంభించిన రోడ్ల నిర్మాణ పనులు వంద శాతం పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలాల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డిఆర్ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జిల్లా అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్ అండ్ బీ రోడ్లకు ఉన్న పాట్ హోల్స్ ను జిల్లాలో వంద శాతం పూర్తి చేయడం, అదే విధంగా పంచాయతీ రోడ్లకు సంబంధించి స్థానిక ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ జిల్లాలో సిసి రోడ్లను 96 శాతం పూర్తి చేసి జిల్లాను ప్రధమ స్థానంలో నిలిపారని ఇందుకు సంబంధించిన అధికారులను కలెక్టర్ అభినందించారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి నిర్దేశించిన 75 లక్షల పని దినాల లక్ష్యంలో ఇప్పటి వరకు 73 లక్షల పని దినాలు కల్పించామని… పెండింగ్లో ఉన్న లక్ష్యాన్ని అధిగమించి ఉపాధి వేతన దారులకు పనులు కల్పించడంలో ఎంపీడీవోలు, క్షేత్రస్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పంట నీటి కుంటలు, పర్కులేషన్ ట్యాంక్స్, ఫిష్ ట్యాంక్స్ తదితర వాటిని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 31వ తేదీ సాయంత్రంలోగా మస్టర్ మొత్తాన్ని వంద శాతం పూర్తి అప్డేట్ చేసి సంబంధిత బిల్లులు అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.పి4 సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని మండల స్పెషల్ అధికారులను, ఎంపీడీవోలను ఆదేశించారు. అదే విధంగా జిఓఎంఎస్.37 ప్రకారం నియోజకవర్గ ప్లాన్ ఏర్పాటు ఏర్పాటు చేసేందుకు నోడల్ ఆఫీసర్లను నియమించామన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా గ్రీవెన్స్ కు వచ్చే వారి దరఖాస్తులను మండల స్థాయిలోనే పరిష్కరించేలా చూడాలన్నారు. జిల్లాలోని పట్టణాలలో ఉన్న ప్రధాన కూడళ్ల వద్ద చలువ పందిళ్ళు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. వేసవి కాలంలో త్రాగు నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా పి4 సర్వేకు సంబంధించిన సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.శ్రీశైలంలో జరగు ఉగాది ఉత్సవాలకు సంబంధించి పెద్ద ఎత్తున కర్ణాటక నుండి ప్రజలు వస్తున్న సందర్భంగా మెడికల్ క్యాంపులు, అంబులెన్సులు ఏర్పాటు చేయాలని డిఎంహెచ్ఓ, ఆత్మకూరు ఆర్డీఓను కలెక్టర్ ఆదేశించారు. అకాల వర్షాల వల్ల కోవెలకుంట్ల, దొర్నిపాడు, గోస్పాడు మండలాల్లో పంట నష్టం అంచనాలను గుర్తించి నివేదికలు సిద్ధం చేయాలని సంబంధిత తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు.