రియాల్టీ షో.. ఏదైనా చూపిస్తామంటే ఉపేక్షించాలా ?
1 min readపల్లెవెలుగువెబ్ : ‘రియాల్టీ షో’ పేరిట ఏదైనా చూపిస్తామంటే ఉపేక్షించేది లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. రియాల్టీ షోలో ఏం చూపిస్తున్నారో అందరికీ తెలుసని, అలాంటి కార్యక్రమాల విషయంలో కళ్లు మూసుకొని ఉండలేమని వ్యాఖ్యానించింది. షోలలో హింసను ప్రోత్సహిస్తున్నారని, దానిని సంస్కృతిగా ఎలా అభివర్ణిస్తారని నిలదీసింది. వ్యాజ్యంపై అత్యవసర విచారణ అవసరమని భావిస్తే.. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ ముందు అభ్యర్థించేందుకు పిటిషనర్‌కు వెసులుబాటు కల్పించింది. వ్యాజ్యాన్ని విచారణ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఎస్. సుబ్బారెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది. బిగ్‌బాస్ షో అసభ్యతను, అశ్లీలతను ప్రోత్సహించేదిగా ఉందని పేర్కొంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.