PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పంటకు గిట్టుబాటు ధర అందించాలి…

1 min read

అమ్మిన ధాన్యానికి సకాలంలో సొమ్ము చెల్లించడమే మన ప్రధమ కర్తవ్యం:
జెడ్పిచైర్మన్ కవురు శ్రీనివాస్
పల్లెవెలుగు, వెబ్​ ఏలూరు: రైతన్నకు పండిన పంటకు గిట్టుబాటు ధర అందించి అమ్మిన ధాన్యానికి సకాలంలో సొమ్ములు చెల్లించేందుకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన కార్యాచరణ అమలు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్ధానిక జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ 1 నుండి 7వరకు గల స్ధాయి కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ సందర్బంగా ప్రణాళిక మరియు ఆర్ధిక స్ధాయి కమిటి, గ్రామీణాభివృద్ధి స్ధాయి కమిటీ వ్యవసాయ స్ధాయి కమిటీ విద్యా మరియు వైద్య సేవల స్ధాయి కమిటీ మహిళా సంక్షేమ స్ధాయి కమిటీ సాంఘీక సంక్షేమ స్ధాయి కమిటీ పనుల స్ధాయి కమిటీలు వారీగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికారులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై జెడ్పి చైర్మన్ కవురు శ్రీనివాస్, జెడ్పి వైస్ చైర్మన్ లు పి. శ్రీలేఖ, పి. విజయబాబు సంబంధిత కమిటీలోని జెడ్పిటిసి సభ్యులతో కలసి సమీక్షించారు.ఈ సందర్బగా జిల్లా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో ఎలాటి లోపాలు లేకుండా రైతులకు మంచి సేవలు అందించాలన్నారు. ఎంతో కష్టపడి ఆరుగాలం శ్రమించి మన అందరికి అన్నం పెడుతున్న రైతన్నకు పండిన పంటకు గిట్టుబాటు ధర అందించి సకాలంలో అమ్మిన ధాన్యానికి సొమ్ము చెల్లించడమే మన ప్రధమ కర్తవ్యమన్నారు. వ్యవసాయానికి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. రైతు మోసపోకుండా ఉండాలనే ఉద్ధేశ్యంతో బహుళప్రయోజనాలు కల్పించే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత సీజన్ లో ఈ-క్రాప్ నమోదు సాంకేతిక పరమైన సమస్యలతో ధాన్యం కొనుగోలు చెల్లింపులో కొంత ఇబ్బంది కలిగిందన్నారు. ఇటువంటివి పునరావతం కాకుండా పటిష్టమైన కార్యాచరణ అమలు చేయాలన్నారు. ఖరీఫ్ ల రైతు పండించిన ప్రతి గింజను గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 10 నుండి 15 రోజుల్లో సొమ్ము చెల్లించేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఏలూరు జిల్లాలో ఖరీఫ్ లో 3.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా తీసుకోవడం జరిగిందన్నారు. ఈ-పంట నమోదు నూరు శాతం అయినప్పటికి ఈకేవైసి 87 శాతం జరిగిందన్నారు. ఇంకా 62 వేల ఎకరాలకు సంబంధించి రైతుల నుంచి వ్రేలిముద్రలు తీసుకోవలసి ఉందన్నారు. ఈ-పంట నమోదు, ఈకేవైసి మరియు నూతన విధానంలో ధాన్యం కొనుగోలు విషయాలపై క్షేత్రస్ధాయిలో రైతులకు పూర్తి అవగాహన కల్పిచాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి 500 చొప్పున వై.ఎస్.ఆర్. జలకళ ఉచిత బోర్లు మంజూరు అయ్యాయని చెప్పారు. మోటారు, పంపుసెట్ ను ప్రభుత్వమే అందిస్తుందని అయితే విద్యుధ్దీకరణ రైతు భరించవలసి ఉంటుందన్నారు. ఏలూరు జిల్లాలో వై.ఎస్.ఆర్ పెన్షన్ కానుక కింద లక్షా 92 వేల 703 మందికి ప్రతి నెల రూ. 49.26 కోట్లు అందించడం జరుగుతుందన్నారు. ప్రతి జనవరి, జూలై నెలల్లో కొత్త పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. గత ఆగష్టు నెలలో ఏలూరు జిల్లాలో 10 వేల 235 మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా 20 వేల 208 స్వయం సహాయక గ్రూపులకు రూ. 772 కోట్లు బ్యాంకు రుణాలు అందించాలన్న లక్ష్యానికి ఇంతవరకు 8150 గ్రూపులకు రూ. 272 కోట్లు అందించడం జరిగిందన్నారు. సమావేశంలో జెడ్పి వైస్ చైర్మన్ లు పి.శ్రీలేఖ,జెడ్పి ముఖ్యకార్యనిర్వాహణాధికారి కె. రవికుమార్,ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పలువురు జెడ్పిటిసిలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

About Author