మహాలయ పక్షాలలో పితృ దీక్ష స్వీకరించండి
1 min read– రుద్రపాద పరిరక్షణ సేవా సమితి అధ్యక్షుడు సాయినాథ్ శర్మ
పల్లెవెలుగు వెబ్ కమలాపురం : మహాలయ పక్షాల్లో పితృ దీక్ష స్వీకరించి పితృదేవతల ఆత్మకు మోక్షం ప్రసాదించి వారి అనుగ్రహం పొందాలని పుష్పగిరి రుద్రపాద పరిరక్షణ సేవా సమితి అధ్యక్షులు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ పితృభక్తి పరాయణులను కోరారు. 30.9 2023 నుంచి 14.10 2023 వరకు 15 రోజులు భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు 15 రోజుల పాటు పితృ దేవతలకు అత్యంత ప్రీతికరమైన రోజులు అని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు లేని వారు మరియు తల్లి ఉండి తండ్రి లేని వారు ఈ దీక్ష స్వీకరించ వచ్చును పితృ దీక్షల స్వీకరించే వారు తెల్లటి దుస్తులు ధరించాలన్నారు. పితృదీక్ష స్వీకరించే వారు ఇతర దీక్షల లాగానే నియమాలు పాటించాలన్నారు. ఉదయం సాయంత్రం పితృ పూజ అర్చన నివేదన నిర్వహించాలన్నారు. కుల మతాలకు అతీతంగా అందరూ ఈ దీక్ష స్వీకరించవచ్చునన్నారు పరమపదించిన తమ పితృదేవతల చిత్రపటాలను గృహములో దక్షిణ వైపున ఉంచి ఉత్తర దిశ వైపు చూసే విధంగా ఉంచాలన్నారు. మహాలయపక్షాల పదహైదు రోజులపాటు పితృ దేవతలకు తిలతర్పణం వదలాలన్నారు. అలాగే ఈ 15 రోజుల మధ్యలో తమ పితరులు పరమపదించిన తిథి రోజున శ్రాద్ధ కర్మ విధిగా నిర్వహించాలన్నారు. మహాలయపక్షాల మధ్యలో శ్రాద్ధకర్మ నిర్వహించడానికి వీలులేని వారు చివరి రోజైన అమావాస్య నాడు శ్రాద్ధకర్మ నిర్వహించవచ్చునన్నారు పితృ లోకం నుంచి పితృదేవతలు అదృశ్య సూక్ష్మ రూపంలో ఈ 15 రోజులు భూలోకంలో సంచరిస్తూ తమ తమ వారసుల గృహాల గడపల వద్ద వేచి ఉంటారన్నారు. తాము సంపాదించిన ఆస్తిపాస్తులు అనుభవించుకుంటూ తమను స్మరించకుండా నిర్లక్ష్యం చేసే వారి పట్ల వారు ఆగ్రహం సైతం వ్యక్తం చేసే పరిస్థితులు ఉంటాయని ధర్మసింధు నిర్ణయ సింధు లాంటి ధర్మ శాస్త్రాలు వివరిస్తున్నాయి. కుటుంబాలలో దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారు, కుటుంబ అభివృద్ధి లేని వారు ఇతర సమస్యలు ఉన్నటువంటి వారు పితృ దీక్ష స్వీకరిస్తే పితృదేవత అనుగ్రహంతో వారికి ఉపశమనం కలుగుతుందన్నారు. పితృదేవతల శ్రాద్ధ కర్మలకు ఎంతో పవిత్రమైన పుష్పగిరి పుణ్యక్షేత్రంలో శ్రీ రాజ్యలక్ష్మిచెన్నకేశవ స్వామి ఆలయ సమీపంలో పినాకిని నదీతీరంలో వెలసిన రుద్రపాదం వద్ద పిండ ప్రదానం చేసి శ్రాద్ధ కర్మ చేసిన పిండాలు రుద్ర పాదానికి తాకించి నదిలో కలిపితే పితృదేవతల ఆత్మకి మోక్షం సిద్ధించి శాంతి కలుగును. వారి వంశీయులను వారసులను దినదినాభివృద్ధి చెందేవిధంగా ఆశీర్వదిస్తారన్నారు. పితృ దీక్ష స్వీకరించేవారు రుద్రాక్ష మాలలు మరియు ఇతర ఆభరణాలు ధరించకూడదు. రుద్రాక్ష కాకుండా ఇతర మాల వేయవచ్చునన్నారు. సాధ్యమైనంతవరకు ఈ పితృపక్షాలు పదిహేను రోజులు పితృ నామస్మరణలో ఉండాలన్నారు. తమకు జన్మనిచ్చిన తమ వంశీయులైన పితృదేవతలతో పాటు తమకు ఆప్తులు ఆత్మీయులు తమ మంచి కోరేవారు తమ బాగోగులు చూసినవారు స్నేహితులు సన్నిహితులు ఇలా ఎవరైనా తమకు కావలసినవారు పరమపదించి ఉంటే వారి ఆత్మ శాంతి కోసం కూడా ఈ పదిహేను రోజులు ఈ దీక్షలో భాగంగా వారిని స్మరిస్తూ తిలతర్పణం , పిండ ప్రధానం చేయవచ్చునన్నారు. వివిధ వృత్తులలో కొనసాగుతున్న వారు ఈ దీక్ష స్వీకరించి తమ వృత్తులను ప్రతిరోజు యధావిధిగా నిర్వహించుకోవచ్చునని వివరించారు. ప్రధానంగా ఈ మహాలయ పక్షాలలో పితృ నామస్మరణకు తిల తర్పణం కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. పితృ దీక్ష స్వీకరించాలనుకునే శ్రద్ధ ఉన్నటువంటి మాతృ పితృభక్తి పారాయణులు సందేహాలు ఉంటే తనను 6300162258 మొబైల్ నంబర్ నందు సంప్రదించవచ్చునన్నారు..