ఎమ్మిగనూరు చేనేత వస్త్రాలకు గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తా.. రాష్ట్ర మంత్రి
1 min read
ఎమ్మిగనూరు, న్యూస్ నేడు: ఎమ్మిగనూరు చేనేత వస్త్రాలకు గుర్తింపు తెచ్చేందుకు తాను కృషి చేస్తానని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని బనవాసిలో ఎంఎస్ఎంఈ మెగా టెక్స్ టైల్స్ పార్క్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు ఎన్.ఎం.డి ఫరూక్, సవితమ్మలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి టి.జి భరత్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో టెక్స్ టైల్స్ పార్క్ తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే బి.వి జయనాగేశ్వర్ రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్‌ను ఏర్పాటుచేసే దిశలో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. ఎమ్మిగనూరు ఎంఎస్ఎంఈ పార్కులో పరిశ్రమలు తీసుకొచ్చేందుకు తాను పూర్తిగా సహకరిస్తానన్నారు. ముందుగా ఎకో సిస్టం తయారుచేస్తే తర్వాత పరిశ్రమలు తరలివస్తాయన్నారు. ఎమ్మిగనూరు చేనేత వస్త్రాలతో తయారుచేసే శాలువాలను టిటిడిలో ఉపయోగించుకునేలా మాట్లాడతానని చెప్పారు. తన శాఖలో సైతం వీటిని ఉపయోగిస్తానని చెప్పారు. తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు. మరో రెండు దశాబ్దాల పాటు మా ప్రభుత్వం కొనసాగితే రాష్ట్రం దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో ముందు వరుసలో ఉంటుందని మంత్రి టి.జి భరత్ చెప్పారు.