గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇళ్ల స్ధలాల రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలి..
1 min readఇంతవరకు 56,454 రిజిస్ట్రేషన్లు పూర్తి
పలు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇళ్ల స్ధలాల రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ సంబంధిత సిబ్బందిని అధికారులను ఆదేశించారు. మంగళవారం స్ధానిక తంగెళ్లమూడిలోని రజకుల పేటవద్ద సచివాలయాన్ని, శనివారపుపేట సచివాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రస్తుతం జిల్లాలో చేపట్టిన నవరత్నాలు పేదలందరికి ఇళ్లు పధకం కింద లబ్దిదారుల ఇళ్ల స్ధలాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం వేగవంతం చేసి వెంటనే లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 75,447 మంది లబ్దిదారులకు గాను నేటి మధ్యాహ్నం వరకు 56,454 రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. తహశీల్దార్లు, యంపిడివోలు, మున్సిపల్ కమీషనర్లు వారి పరిధిలో వున్న గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించి అక్కడి రిజిస్ట్రేషన్ల పనులను గమనించి వేగవంతం చేయాలన్నారు. ఏమైన సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కలెక్టర్ వెంట నగరపాలక కమీషనరు ఎస్. వెంకటకృష్ణ తదితరులు ఉన్నారు.