పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదిలేలోపే పునరావాసం పూర్తి
1 min read
2027 నవంబర్ నాటికి పునరావాసం… డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తాం
రూ. 829 కోట్లు నేరుగా నిర్వాసితుల అకౌంట్లో జమ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది
మాది మాయ మాటలు చెప్పే ప్రభుత్వం కాదు.. చెప్పింది చేసి చూపించే ప్రభుత్వం
గత ప్రభుత్వంలో మిమ్మల్ని పట్టించుకున్న నాథుడే లేడు
అర్హులైన ప్రతిఒక్కరికీ పరిహారం అందిస్తాం
ఆదాయం,జీవనప్రమాణాలు పెంచేందుకు చర్యలు
పోలవరం నిర్వాసితులతో ముఖాముఖిలో ముఖ్యమంత్రి చంద్రబాబు
వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు పడ్డామన్న నిర్వాసితులు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి. ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు విడిచి పెట్టకముందే నిర్వాసితులందరికీ పునరావాసం పూర్తి చేస్తాం. ఆ తర్వాతనే ప్రాజెక్టును ప్రారంభిస్తాం.’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు గురువారం ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం నిర్వాసితులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.
ఖర్చుచేసే ప్రతిపైసా నిర్వాసితులకే చెందాలి
2014లో మేము అధికారంలోకి రాకముందు నిర్వాసితులకు చాలా తక్కువ పరిహారం ఇచ్చారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక రూ.4,311 కోట్ల పరిహారం చెల్లించాం. కానీ 2019లో వచ్చిన ప్రభుత్వం ఆ ఐదేళ్లలో ఒక్కసారి కూడా మీ గురించి ఆలోచించడం కానీ, పట్టించుకోవడం కానీ చేయలేదు. కనీసం మీ సమస్యల పట్ల ఆలోచించిన దాఖలాలు కూడా లేవు. పోలవరం పూర్తవ్వాలంటే తెలంగాణలోని 7 ముంపు మండలాలు ఏపీలో విలీనం చేయాలని అప్పట్లో ప్రధాని మోదీని ఒప్పించాం. వీలైనంత వరకు మీకు న్యాయం చేసి ఆదుకోవాలని ముందుకెళ్లాం. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వాసితుల అకౌంట్లో రూ.829 కోట్లు జమ చేశాం. 2014-19 మధ్య మా ప్రభుత్వం ఇచ్చే పరిహారం సరిపోదని ప్రతిపక్షంలో ఉన్న జగన్ రూ.10 లక్షలు పరిహారం ఇస్తానన్నాడు…ఇచ్చాడా.? ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఒక్కపైసా బాధితులకు రూపాయి కూడా ఇచ్చింది లేదు. కనీసం వరదలు వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని పట్టించుకోలేదు. మళ్లీ రానున్న రోజుల్లో మీ దగ్గరకు వచ్చి అది చేస్తాం… ఇది చేస్తాం అని చెప్పి మీ వద్దకు వస్తారు. గత పాలకులు పోలవరం ప్రాజెక్టుకు ఏ గతి పట్టించారో చూశాం. 2019లో మా ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చి ఉండుంటే 2020కి ప్రాజెక్టు పూర్తయ్యేది. ఆలస్యం చేయడం వల్ల ఖర్చు భారీగా పెరిగిపోయాంది. రూ.400 కోట్లతో డయాఫ్రం వాల్ కడితే వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కొట్టుకుపోయింది. ఇప్పుడు మళ్లీ రూ.990 కోట్లతో కొత్త డయాఫ్రంవాల్ నిర్మిస్తున్నాం. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా వృథా చేశారు. ఖర్చు పెట్టే ప్రతిపైసా మీకే చెందాలి. ప్రజల సొమ్మును ప్రజల కోసమే ఖర్చు చేయాలి తప్ప దుర్వినియోగం చేయకూడదు.
గత పాలకులు పోలవరం నిధులు మళ్లించారు
నేను సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని పనిచేశాను. 33 సార్లు ప్రాజెక్టును సందర్శించాను. 2027 నాటికి పునరావాసాలు పూర్తి చేస్తాం. దళారులు, మోసగాళ్లకు అవకాశం లేకుండా చేస్తాం. కొందరి పేర్లు తొలగించారని బాధితులు చెబుతున్నారు… విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. అర్హులైన ప్రతి ఒక్కరికి పరిహారం చెల్లిస్తాం… ఏ ఒక్కరికీ అన్యాయం జరగనివ్వం. పోలవరానికి కేంద్రం ఇచ్చిన నిధులను గత పాలకులు ఇతర అవసరాలకు మళ్లించారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తయి ఉంటే మీరు ఈ పాటికే స్థిరపడేవారు. పోలవరం హైడల్ ప్రాజెక్టు పూర్తయి ఉంటే రూ.2,500 కోట్ల ఆదాయం వచ్చేది. దాన్ని కూడా ఆలస్యం చేయడంతో అదనపు భారం పడి ఖర్చు కూడా పెరిగింది.
మా ప్రభుత్వంలో మాయమాటలు చెప్పేవారు లేరు
పునరావాసం కల్పించిన తర్వాత మీ ఆదాయ మార్గాలు, జీవన ప్రమాణాలు పెరగడానికి చర్యలు తీసుకుంటాం మీరు బ్రహ్మాండంగా ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించారు. మీరు ధైర్యంగా ఉండండి. ఇది మీ ప్రభుత్వం… మనందరి ప్రభుత్వం. మంచిని మంచిగా చెప్తే మరింత మంచి జరుగుతుంది. మంచి చేసిన వారికి సహకరించకపోతే తప్పే అవుతుంది. ఈ ప్రభుత్వంలో దళారులు, దొంగలు, మోసగాళ్లు, మాయ మాటలు చెప్పేవారు అస్సలు లేరు. చేసే పని మాత్రమే చెప్పి చేసి చూపిస్తాం. ప్రాజెక్టు కోసం గిరిజనులు ఎక్కువ త్యాగం చేశారు. ఇళ్లు నిర్మించుకునే గిరిజనులకు రూ.75 వేలు అదనంగా మన కూటమి ప్రభుత్వం అందిస్తోంది’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
