తక్షణమే హంద్రీనీవా ద్వారా నీటి విడుదల ప్రారంభించాలి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: రోమ్ నగరం తగలబడుతూ ఉంటే, నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకుంటూ ఉన్నాడని కథలు విన్నామనీ, అలాంటి కథకు ఇంచుమించు సారూప్యమున్న కథ మన రాయలసీమ వాసులు కొంచెం దృష్టి పెడితే స్పష్టంగా కనబడుతుందని, దీని ఇతివృత్తం మనం బతకడానికి కావలసిన “నీళ్ళు” అని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు.ఆదివారం నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దశరథరామిరెడ్డి మాట్లాడుతూ..శ్రీశైలం రిజర్వాయర్ లో ప్రస్తుతం 861 అడుగులలో 119 టి ఎం సీ ల నీరు ఉంది, శ్రీశైలం రిజర్వాయర్ లో 854 అడుగులు స్థాయికంటే దిగువకు తగ్గితే పోతిరెడ్డిపాడు నుండి రాయలసీమకు తీసుకొనే అవకాశం క్షీణిస్తుందని ఆయన ఆందోళన వెలుబుచ్చారు.ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తికి సగటున 25000 క్యూసెక్కులు, కాలువలకు అందించడానికి 14000 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్ కు వచ్చి చేరే నీటి పరిమాణాన్ని, వినియోగిస్తున్న నీటిని పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటే శ్రీశైలం రిజర్వాయర్ లో నీటి స్థాయి 854 అడుగులకు చేరడానికి ఇంచుమించు వారం రోజుల సమయం పడుతుందని అయన తెలిపారు. ఈ వారం రోజుల్లో కాలువ ద్వారా రాయలసీమ రిజర్వాయర్లకు 7 టి ఎం సీ ల కు మించి నీరు తీసుకునే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.రాయలసీమలో అత్యంత వెనుకబడిన కర్నూలు పశ్చిమ ప్రాంత, అనంతపురం జిల్లా చెరువులకు, రిజర్వాయర్లకు నీరందించే హంద్రీనీవా నుండి నీటిని ఎత్తిపోయక పోవడం విచారకరం అని అన్నారు. తక్షణమే హంద్రీనీవా ద్వారా నీటి విడుదల ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేసారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీశైలం నుండి విద్యుత్ ఉత్పత్తి ఆపి ఎగువన ఉన్న రాయలసీమ అవసరాలకు వీలైనంత నీటిని పొందాల్సిన అవసరం ఉందని అయన పేర్కొన్నారు.దిగువన ఉన్న కోస్తా, తెలంగాణ నీటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనడానికి శ్రీశైలం రిజర్వాయర్ 854 దిగువ నుండి కుడా నీరు పొందే అవకాశం ఎలాగూ ఉండనే ఉందని ఆయన తెలిపారు.ఈ నేపథ్యంలో శ్రీశైలం రిజర్వాయర్ నుండి విద్యుత్ ను ఆపండని కృష్ణా నది యాజమాన్యం బోర్డుకు ఈ ఎన్ సి ద్వారా ఉత్తరం వ్రాసాం అని రాయలసీమ వాసులను మభ్య పరిచే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టడం సహేతుకంగా లేదని ఆయన విమర్శించారు.
వారు ఆపకపోతే ఏమి చేస్తాం అని చోద్యం చూస్తూ కూర్చున్న ప్రభుత్వ నిర్వాకం రాయలసీమ వాసులను దహించి వేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్తితి రోమ్ కాలిపోతుంటే, చక్రవర్తి చేష్టలను గుర్తుకు తెస్తున్నదని దశరథరామిరెడ్డి అన్నారు.రాయలసీమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు స్వయంగా రాజకీయ దౌత్యం చేసి శ్రీశైలం రిజర్వాయర్ నుండి విద్యుత్ ఉత్పత్తిని తక్షణమే ఆపాలని ఆయన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. రివర్స్ బుల్ టర్బైన్స్ ద్వారా నీటిని శ్రీశైలం రిజర్వాయర్ లోనికి తిరిగి తోడే అవకాశాలుంటేనే విద్యుత్ ఉత్పత్తి చేపట్టే విధానాన్ని అమలుచేయాలని ఆయన కోరారు. ముఖ్య మంత్రి ఈ దిశగా కార్యోణ్మకులు అవ్వడానికి రాయలసీమ ప్రజా ప్రతినిధులు తక్షణమే కార్యాచరణ చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాయలసీమ వాసుల పరిస్థితి మరింత దిగజారక ముందే రాయలసీమ ప్రజాప్రతినిధులు స్పందించాలని ఆయన డిమాండ్ చేసారు.ఈ సమావేశంలో సమితి ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి, ఉప్పలపాటి బాలీశ్వరరెడ్డి, కార్యవర్గ సభ్యులు మహేశ్వరరెడ్డి, కొమ్మా శ్రీహరి, భాస్కర్ రెడ్డి, షణ్ముఖరావు, పర్వేజ్ , ఏరువ రామిరెడ్డి, పట్నం రాముడు, నిట్టూరు సుధాకర్ రావు పాల్గొన్నారు.